28-03-2025 12:44:54 AM
సీఎస్ శాంతికుమారి ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): పదవీ విరమణ తర్వాత కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో తిరిగి నియమితులైన, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు గా పనిచేస్తున్న వారందరినీ వెంటనే ఆయా పోస్టుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఆదేశా లు జారీ చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులను సత్వరమే తొలగించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అవసరమను కుంటే ప్రభుత్వం తిరిగి తాజా ఉత్తర్వులు ఇచ్చి వారిని విధుల్లోకి తీసుకుంటుందని తెలిపారు. కాగా ఇలా రిటైర్డ్ అయి తిరిగి పనిచేస్తున్న వారిలో ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు.
1999లో పదవీ విరమణ చేసిన వారు కూడా ఇంకా పనిచేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. చాలా మంది కార్పొరేషన్లలో అధికారుల హోదాల్లో రిటైరైనా కన్సల్టెంట్లుగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాకముందే రిటైరైన వారు కూడా చాలా మంది ఈ జాబితాలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఒక్క మున్సిపల్ శాఖలోనే 177 మంది రిటైరైనా కూడా ఇంకా వివిధ రూపాల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిసింది.