calender_icon.png 14 November, 2024 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలను తొలగించండి

14-11-2024 12:45:27 AM

ఖాజాగూడ కొత్తచెరువు శిఖం భూముల విషయంలో అధికారులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాం తి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ కొత్తచెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువు రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలపై అందిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని, నిర్మాణాలు అక్రమమని తేలితే వాటిని తొలగించాలని ఆదేశించింది.

ఖాజాగూడ సర్వేనెం.5లోని 5.25 ఎకరాల్లో కొత్తచెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ సెప్టెంబరు 6, 10 తేదీల్లో అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఆర్ రామకృష్ణ సహా మరో అయిదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు.

పిటిషనర్ల వాదనలు విన్న న్యాయమూర్తి నీటిపారుదల, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శులు, జిల్లా కలెక్టర్, హెచ్‌ఎండీఏ, హైడ్రా, ప్రైవేటు సంస్థలు సొహిని బిల్డర్స్ ఎల్‌ఎల్పీ, బేవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, ఎం భరతేంద్రరెడ్డి, కే జ్ఞానేశ్వర్, దామర్ల రాఘవరావుకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 26కు వాయిదా వేశారు. కౌంటర్లు దాఖలు చేసిన తర్వాత సమగ్ర విచారణ చేపడుతామని తెలిపారు. 

జీవోలు తెలుగులోనూ ఇవ్వాలి

హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో జీవోలు, ఆర్డినెన్స్‌లను తెలుగులో జారీ చేయకపోవడంపై ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇది అధికార భాషల చట్టం 1956తోపాటు పలు జీవోలకు విరుద్ధమంటూ శేరిలింగంపల్లికి చెందిన జీ ఉమామహేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఇంగ్లీషులోనే వెలువడుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎప్పుడో 1980ల్లో ఇచ్చిన జీవోలను సవాలు చేస్తూ ఇప్పుడు పిటిషన్ వేయడమేంటని ప్రశ్నించించింది. 72 ఏళ్ల వయసులో ప్రచారం నిమిత్తం ఇలాంటి పిటిషన్లు వేయరాదని హితవు పలికింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించడంపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.