calender_icon.png 30 October, 2024 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైన్లపై ఆక్రమణలు తొలగించండి

01-08-2024 02:07:41 AM

ఎంసీడీ అధికారులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, జూలై 31: ఢిల్లీ రాజేంద్ర నగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద నీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటనలో దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. రాజేంద్ర నగర్ ప్రాంతంలోని డ్రైన్లపై ఉన్న అన్ని ఆక్రమణలను శుక్రవారం లోగా తొలగించాలని ఆదేశాలిచ్చింది. ఈ ఘటనలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)కి చెందిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది.

పన్నులు వసూలు చేయకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతించి డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే అనర్థాలకు దారితీస్తుందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. వందల ఏళ్ల నాటి మౌలిక సదుపాయాలను ఎందుకు మెరుగుపరచడం లేదని నిలదీసింది. ఆ పనే చేసి ఉంటే సెల్లార్‌లోకి నీళ్లు ఎలా వెళ్లేవని ప్రశ్నించింది. అధికారుల బాధ్యతరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది.

ఈ ఘటనకు సంబంధించి జూనియర్ అధికారులను విధుల నుంచి తొలగించారు కానీ, పర్యవేక్షించాల్సిన సీనియర్ అధికారుల సంగతేంటని నిలదీసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎవరైనా జైలుకు వెళ్లారా అని కోర్టు ప్రశ్నించింది. కోచింగ్ సెంటర్‌లో సంభవించిన ఈ మరణాలపై విచారణను కేంద్ర ఏజెన్సీకి బదిలీ చేయాలని సూచనప్రాయంగా పేర్కొంది. ఎంసీడీ కమిషనర్, డీసీపీ, దర్యాప్తు అధికారి కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 

మంత్రికి నివేదిక సమర్పించిన సీఎస్..

కాగా, ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థుల విషాద మరణాల నేపథ్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ ఆ రాష్ట్ర మంత్రి అతిషికి విచారణ నివేదికను సమర్పించారు. సూపరింటెండెంట్ ఇంజినీర్ అజయ్‌కుమార్ నాగ్‌పాల్ రూపొందించిన నివేదికలో పలు అంశాలను పొందుపర్చారు.