20-04-2025 12:22:53 AM
హైదరాబాద్, ఏప్రిల్ 19: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు మరో తలనొప్పి వచ్చి పడింది. మొన్నటివరకు ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉచిత పాస్‌ల రగడ మరువక ముందే మరో కొత్త సమస్య తెర మీదకు వచ్చింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని నార్త్‌స్టాండ్‌కు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరు పెట్టడంపై అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.
వెంటనే నార్త్‌స్టాండ్‌కు అజారుద్దీన్ పేరును తొలగించాలని జస్టిస్ ఈశ్వరయ్య శనివారం హెచ్‌సీఏకు ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌సీఏకు అనుబంధ సంస్థ అయిన లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఈశ్వరయ్య విచారణ జరిపారు. హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అజారుద్దీన్ ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు తన పేరు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
తన పేరు తానే పెట్టుకోవాలన్న నిర్ణయం చెల్లదని స్పష్టం చేశారు. అజారుద్దీన్ తీసుకున్న నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలున్నాయని వెల్లడించారు. వెంటనే ఉప్పల్ స్టేడియంలోని నార్త్‌స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. నార్త్ స్టాండ్ టికెట్లపై ఇక నుంచి అజారుద్దీన్ పేరు ప్రస్థావనకు రావొద్దని అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య తేల్చి చెప్పారు.