calender_icon.png 25 September, 2024 | 3:58 PM

ఉన్నావ్ బాధితురాలికి భద్రత తొలగింపు

25-09-2024 04:12:57 AM

సుప్రీంకోర్టుకు వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: 2017లో ఉన్నావ్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం బాధితురాలికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీఆర్పీఎఫ్ భద్రతను ప్రస్తుతం తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టులో పిటి షన్ దాఖలు చేసింది.

మంగళవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఎం త్రివేది, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం.. భద్రత తొలగింపుపై బాధితురాలు సమాధానం ఏంటని ప్రశ్నించింది. కేంద్రం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ప్రస్తుతం బాధితురాలికి ఎటువంటి బెదిరింపు కాల్స్ రావడం లేదని, కావున భద్రత అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ తరఫున లాయర్ మాట్లాడుతూ.. సుప్రీం ఆదేశాల మేరకు విచారణతో పాటు అన్ని అంశాలు ఢిల్లీకి బదిలీ చేశామన్నారు. ప్రస్తుతం బాధితురాలు ఎక్కడ నివాసం ఉంటోందని కోర్టు ప్రశ్నించగా.. ఢిల్లీలోనే అని న్యాయవాది సమాధానం ఇచ్చారు.

కాగా 2017లో యూపీలోని ఉన్నావ్‌కు చెందిన ఓ బాలికపై కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కుల్దీప్ సహా మరో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

కాగా అత్యాచారం జరిగిన ఏడాదికే ఓ కేసులో బాధితురాలి తండ్రి అరెస్టు అవగా కస్టడీలోనే మరణించాడు. బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్తుండగా వారిపై జరిగిన హత్యాయంత్నంలో బాధితురాలు మినహా కుటుం బ సభ్యులందరూ మరణించారు