హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి) : నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ బోర్డు, బ్యానర్‌ను ఎల్‌అండ్‌టీ అధికారులు తొలగించారు. ఇదే విషయమై శుక్రవారం విజయక్రాంతి దినపత్రికలో ‘మెట్రో ప్రయాణికులపై పార్కింగ్ భారం’ పేరిట ప్రత్యేక కథనం ప్రచురణ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పెయిడ్ పార్కింగ్ అమలు నిర్ణయాన్ని రెండుసార్లు వాయిదా వేసిన మెట్రో యాజమాన్యం మరోసారి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. పెయిడ్ పార్కింగ్ బోర్డుల తొలగింపుతో మెట్రో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎల్‌అండ్‌టీ అధికారులు మాత్రం అధికారికంగా స్పందించాల్సి ఉంది.నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయబోతున్నట్లు ఆగస్టు 14న బోర్డులు ఏర్పాటు చేశారు.
ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో నాగోల్‌లో ఆగస్టు 25 నుంచి, మియాపూర్‌లో సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియను ఆగస్టు 24న మరోసారి వాయిదా వేశారు. సెప్టెంబర్ 15నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేయబోతున్నట్లు ఇటీవల మరోసారి బోర్డులను ఏర్పాటు చేసి.. శుక్రవారం వాటిని తొలగించారు. నాగోల్ వద్ద బోర్డును తొలగించినప్పటికీ మియాపూర్‌లో ఇప్పటికీ తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.