11-02-2025 12:18:49 AM
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 10 : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఫుట్ పాత్ ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝలిపించారు. రహదారికి ఇరువైపులా ఫుట్పాత్ లపై నిర్మించిన వాటిని తొలగించారు. అప్పా జంక్షన్ నుంచి అరె మైసమ్మ టెంపుల్ మీదుగా సన్ సిటీ తో పాటు టిప్పు ఖాన్ బ్రిడ్జి వరకు రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా వెలిసిన షెడ్లను, అదేవిధంగా డబ్బాలను మున్సిపల్ జెసిబిలతో తొలగించారు.
కొందరు వ్యాపారులు ఫుట్ పాత్ లతో పాటు రోడ్డును ఆక్రమించడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని ఫిర్యాదులు అందడంతో కూల్చివేతలు చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఫుట్ పాత్ లను ఆక్రమించుకొని కొందరు అక్రమంగా దుకాణాలు పెట్టడంతో రోడ్డుపై నడిచేవారికి ఇబ్బందులు కలుగుతున్నాయని మున్సిపల్ అధికారులు తెలియజేశారు.
ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ ఏసిపి తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దుకాణాదారులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు సముదాయించారు.