21-03-2025 01:14:58 AM
చెరువు కబ్జాపై గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు
మాసబ్ చెరువు కబ్జాపై స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అసెంబ్లీ చర్చ
హుటహుటిన రంగంలోకి దిగిన హైడ్రా, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు
కొనసాగుతున్న అక్రమ రోడ్డు తొలగింపు చర్యలు
అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 20: రంగారెడ్డి జిల్లా, తుర్కయంజాల్ మున్సిపాలిటీ మాసబ్ చెరువులో అక్రమంగా వేసిన రోడ్డు హైడ్రా, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు జేసీబీల సహాయంతో రోడ్డు తొలగించారు. తుర్కయంజాల్ సర్వే నెంబర్ 137లోని 320 ఎకరాల విస్తీర్ణంలో మాసబ్ చెరువుంది. బఫర్జోన్లో 200 ఎకరాలు. ఈ చెరువుకు సమీపంలో ప్రైవేటు పట్టాభూములు ఉండడంతో వాటిపక్కనే మా భూములూ ఉన్నాయంటూ కొందరు సుమారు 90 ఎకరాల వరకు చెరువును ఆక్రమించినట్లు తెలుస్తుంది. తుర్కయాంజాల్ మున్సిపాలిటీగా మారడం.. అదే విధంగా హైదరాబాద్‌కు కూతపెట్టే దూరంలో ఉండడంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ పెరింగింది.
ఇండ్ల నిర్మాణాలు కూడా జోరుగా సాగుతున్నాయి. దీంతో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కూడా అక్రమార్కులు వదలడం లేదు. అందులో భాగంగానే మాసబ్ చెరువు కబ్జాచేసి చెరువు మధ్యలోనుంచి రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ మాసబ్‌చెరువును పరిశీలించి.. చెరువులను ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించి.. చెరువులోని నిర్మాణాలు తొలగించాలని సిబ్బందికి ఆదేశాలను ఇచ్చారు. ఆ నిర్మాణాలను తొలగించినా... ఇంతటితో ఆగకుండా మరల అక్రమార్కులు మాసబ్ చెరువులో నిండుకుండాల నీళ్లు ఉన్నా... పెద్ద..పెద్ద బండరాళ్లతో, మోరంతో రోడ్డు పటిష్టంగా నిర్మించారు.
మాసబ్ చెరువు అక్రమ రోడ్డు నిర్మాణంపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రస్తవించడంతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో హుటహుటిన హైడ్రా, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు మాసబ్ చెరువులోని అక్రమ రోడ్డును తొలగించేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ప్రొటెక్షన్‌తో అధికారులు తొలగింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు, ఇరిగేషన్ ఏఈ వంశీగౌడ్, తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.