calender_icon.png 20 November, 2024 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమర్జెన్సీ రోజులు మళ్లీ గుర్తొస్తున్నయ్!

14-09-2024 03:10:00 AM

మా పార్టీ ఎమ్మెల్యేలంటే ఎందుకంత వణుకు

దాడి చేసిన వారిని వదిలి మాపై కేసులా?

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యమంటూ అప్పటి ఎమర్జెన్సీ రోజులను మళ్లీ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, బీఆర్‌ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే సీఎం వెన్నులో వణుకెందుకని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ప్రశ్నించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసి చీకటిరోజులను గుర్తుచేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

దాడిచేసిన వారిని వదిలేసి బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. బీఆర్‌ఎస్ నేతలపై ప్రభుత్వం జులూం చెలాయించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు.  తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష  ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని తీసుకొచ్చారని మండిపడ్డారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ర్టవ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అరెస్టులు చేసిన తమ పార్టీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.