calender_icon.png 3 April, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి!

02-04-2025 12:00:00 AM

  • నేను సినిమాలు తీస్తేనే మీ సైట్లు, ఛానళ్లు పనిచేస్తున్నాయ్

రివ్యూవర్లపై ‘మ్యాడ్’ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఆగ్రహం

నార్నె నితిన్, సంగీత్‌శోభన్, రామ్‌నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. ఈ సినిమాను కళ్యాణ్‌శంకర్ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించగా, సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సమర్పకుడు సూర్యదేవర నాగవంశీ మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ సంద ర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “మ్యాడ్‌స్వేర్’లో కంటెంట్ ఉండటం వల్లే ప్రేక్షకులు చూస్తున్నారు. కానీ, చాలా మంది.. కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతోందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎలా ఉన్నా చూడటానికి ఇది ‘బాహుబలి2’, ‘పుష్ప2’, ‘కేజీఎఫ్2’ కాదు కదా! ఇందులో నటించిన వాళ్లేమీ పెద్ద హీరోలు కాదు. ఇది అందరూ తెలుసుకోవాలి. ‘స్వాతిరెడ్డి’ పాటపై కూడా కామెంట్లు చేశారు..

సెకండాఫ్ పండలేదని అంటున్నారు. అయితే, ప్రేక్షకుల నుంచి స్పందన బాగానే ఉంది. జనాలకు తెలిసినంత బాగా రివ్యూవర్లకు తెలియడం లేదా?! సినిమా విడుదల తర్వాత కూడా నేను ప్రెస్‌మీట్ పెట్టాను. అప్పుడు రివ్యూల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ల పని వాళ్లు చేశారు. కానీ, ఆ రివ్యూల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీరు (మీడియా), మేమూ కలిసి పనిచేయాలి.

నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్‌సైట్లు రన్ అవుతున్నాయి. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. మేము యాడ్స్ ఇస్తేనే మీ సైట్స్ పనిచేస్తాయి. సినిమాను చంపకండి. సినిమా ఆడుతున్నప్పుడు కూడా ‘కంటెంట్ లేని మూవీ ఎందుకు ఆడుతుందో తెలియదు’ అంటూ తీర్పులు ఇవ్వకండి. సినిమాలు ఆడితేనే మీరూ ఉంటారు. లేకపోతే ఇంటికి వెళ్లాల్సిందే. అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ.