calender_icon.png 20 November, 2024 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదు!

20-11-2024 02:12:12 AM

  1. మహారాష్ట్రలో సీఎం రేవంత్ హామీలు అవివేకం
  2. హైదరాబాద్‌లో 21 నుంచి ‘లోక్ మంథన్’
  3. ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియా సమావేశం

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): మతపరమైన రిజర్వేషన్లు రాజ్యంగ బద్ధం కాదని, హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇవ్వడం అవివేకమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ శిల్పారామంలో ఈ నెల 21 నుంచి 24 వరకు ‘లోక్‌మంథన్’ జరుగనున్న నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రె స్ మహారాష్ట్రలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. టీటీడీ పాలక మండలి సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టడాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు.

తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలనే నిర్ణయాన్నీ సమర్థిస్తున్నామని తేల్చిచెప్పారు. హిందూ దేవాలయాల్లో కచ్చితంగా హిందువులే పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేవాలయాల్లో ఇతర మతస్థులు ఉద్యోగాల్లో ఉండడం సరికాదని, ఆ ఉద్యోగులను వేరేచోటికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

లగచర్ల ఘటనపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా.. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని సమాధానమిచ్చారు. హైదరాబాద్‌లో జరిగే ‘లోక్ మంథన్’కు భారీగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుతం విభజన రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయని, వీటిపై ప్రజానీకానికి ఒక అవగాహన కల్పించడమే లోకమంథన్ ఉద్దేశమన్నారు.

ఇది రాజకీయ వేదిక కాదని. దేశ సాంస్కృతిక, సంప్రదాయ ఏకీకరణ మాత్రమేనని తేలిచెప్పారు. మొదటి రోజు ఎగ్జిబిషన్స్, కల్చరల్ ఫెస్టివల్‌ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారన్నారు. 22న వివిధ దేశాల ప్రతినిధులతో మేధోమథనం నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీకారం చుడతారన్నారు. కార్యక్రమాల్లో 1,500 మంది కళాకారులు 100కుపైగా కళా ప్రదర్శనలిస్తారని వెల్లడించారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.