calender_icon.png 18 October, 2024 | 2:31 PM

మతం, విశ్వాసం మానవతా విలువలు పెంచేలా ఉండాలి..

18-10-2024 12:21:28 PM

బెల్లంపల్లిలో ఘనంగా కల్వరి 50 రోజుల ఉపవాస దీక్షల ముగింపు..

కల్వరి మినిస్ట్రీస్ ఉపవాస దీక్షలో మంత్రి సీతక్క..

అశేషంగా హాజరైన క్రైస్తవులు..

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మతం, విశ్వాసం ఎప్పుడు మానవత విలువలను పెంపొందించేలా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం బెల్లంపల్లిలోని కల్వరి మినిస్ట్రీస్ లో ఫాస్టర్ ప్రవీణ్, షారోన్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన 50 రోజుల ఉపవాస దీక్ష ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ శాంతి కోసం కల్వరి మినిస్ట్రీస్ లో 50 రోజుల ఉపవాస దీక్షలు, క్రైస్తవ ప్రార్థనలు చేపట్టడం అభినందనీయమన్నారు. బెల్లంపల్లి లాంటి చిన్న పట్టణం నుండి తరిమి వేయబడ్డ ఫాస్టర్ ప్రవీణ్ తిరిగి బెల్లంపల్లి గడ్డపైన దైవాజ్ఞలో లీనమై ప్రపంచ దేశాల దృష్టినాకర్షించారన్నారు.

కుల, మతాలకు అతీతంగా ప్రజలందరి మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల దైవాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, ఇది సరైనది కాదన్నారు. దైవాన్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దని కోరారు. రామగుండం సిపి ఎన్. శ్రీనివాస్, మంచిర్యాల డిసిపి ఎగ్గ డి భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ల ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. గురువారం రాత్రి నిర్వహించిన ఉపవాస దీక్షల విరమణ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుండి లక్షకు పైగా దైవజనులు హాజరయ్యారు.

మంత్రి సీతక్క వెంట బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎమ్మెల్సీ దండే విటల్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ వేణుగోపాల చారి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె. విశ్వ ప్రసాద్, బెల్లంపల్లి మాజీ జెడ్పిటిసి కారుకూరి రాoచందర్, బెల్లంపల్లి మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎం.సూరిబాబు, నా తరి స్వామిలతో పాటు పట్టణానికి చెందిన కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన చర్చిల పాస్టర్లు, క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.