calender_icon.png 3 October, 2024 | 11:57 AM

నిజాంపేట మున్సిపల్ కమిషనర్‌కు ఊరట

03-10-2024 02:32:10 AM

హైడ్రా ఫిర్యాదు కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ఎర్రకుంట బఫర్ జోన్‌లోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసి, వాటిని ప్రోత్సహించారనే కారణంగా హైడ్రా ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో నిజాంపేట మున్సిపల్ కమిషనర్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పీ రామకృష్ణారావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారించారు. పిటిషనర్ రెండు వారాల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని, రూ.20 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు పిటిషనర్ నుంచి తీసుకుని విడుదల చేయాలని పోలీసులకు సూచించారు.

ప్రతి శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య 8 వారాలపాటు లేదంటే పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశించారు. సాక్ష్యాలను తారుమారు చేయరాదని, సాక్షులను బెదిరించరాదని షరతులు విధించింది. పిటిషనర్ న్యాయవాది వీ సురేందర్ రావు వాదిస్తూ.. అదనపు అంతస్తులకు హెచ్‌ఎండీయేనే అనుమతులు మంజూరు చేస్తుందన్నారు.

సర్వే నెం 48, 49లో ఎర్రకుంట బఫర్‌జోన్‌లో ఉందని, అనుమతులు ఇచ్చేముందు దానిని పరిశీలించాలని పిటిషనర్ హెచ్ ఎండీఏకి లేఖ రాశారని చెప్పారు. ఈ లేఖ ఆధారంగా హెచ్‌ఎండీయే మ్యాప్స్ ఇనఫ్రా నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించిందని చెప్పారు. పిటిషనరే నోటీసు ఇచ్చారని, మ్యాప్స్ ఇన్ఫ్రా ఈ నోటీసుపై హైకోర్టును ఆశ్రయించిందని వివరించారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహించారని, దర్యాప్తు జరుగుతున్నందున బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. వాదనలను విన్న హైకోర్టు, పిటిషనర్ లేఖతోనే హెచ్‌ఎండీయే నిర్మాణాలను నిలిపివేసిందని, అంతేగాకుండా హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నిర్మాణాల్లో పిటిషనర్ జోక్యం చేసుకోలేరు కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.