ముందస్తు బెయిలు మంజూరు చేసిన హైకోర్టు
చెరువుల ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ ఫిర్యాదు కేసులో మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, సెప్టెంబర్ ౫ (విజయక్రాంతి): చెరువుల ఆక్రమణలకు సహకారం అందించారని పేర్కొంటూ హైడ్రా కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్‌కు హైకోర్టులో గురువారం వెసులుబాటు లభించింది. నిజాంపేట మున్సిపాలిటీలోని ప్రగతినగర్‌లోని 3 ఎకరాల్లోని ఎరక్రుంట ఆక్రమణలకు సహకరించారనే కేసులో పిటిషనర్ రెండో నిందితుడిగా పూల్‌సింగ్ ఉన్నారు. ఆర్థిక నేరాల విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణరావు, బాచుపల్లి ఎమ్మార్వో పూల్‌సింగ్ సర్వే శాఖ సహాయ డైరెక్టర్ కే శ్రీనివాసులు, సహాయ ప్లానింగ్ అధికారి సుధీర్ కుమార్‌పై ఆగస్టు 30న కేసు నమోదైంది. పూల్‌సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కే సుజన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. పూల్‌సింగ్ 2023 ఆగస్టులో ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టారని, అప్పటికే అనుమతులు జారీ అయ్యాయని పిటిషనర్ న్యాయవాది చెప్పారు.