హైదరాబాద్: రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలతో కూడిన కేసులో తెలుగు సినీ నటి హేమ(Telugu film actress Hema)కు కర్ణాటక హైకోర్టు నుంచి ఊరట లభించింది. బెంగుళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొని డ్రగ్స్ సేవించిందని గత ఏడాది మే నెలలో కేసు నమోదైంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణపై స్టే విధించింది.
పార్టీ సమయంలో హేమ ఎండీఎంఏ తాగినట్లు రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని జస్టిస్ హేమంత్ చందంగౌడ్(Justice Hemant Chandangoudar) అన్నారు. కేవలం సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలాల ఆధారంగానే ఆమెపై చార్జిషీటు దాఖలు చేసినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎన్‌డిపిఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కేసులో పెండింగ్‌లో ఉన్న ఛార్జ్ షీట్, తదుపరి విచారణలపై స్టే విధించాలని కోరుతూ హేమ 8వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి, బెంగళూరు రూరల్(Bangalore Rural), ఎన్‌డిపిఎస్ కేసులకు ప్రత్యేక న్యాయమూర్తి ముందు ఒక మధ్యంతర దరఖాస్తును దాఖలు చేసింది. ఆమె దరఖాస్తును పరిశీలించిన హైకోర్టు ఆమెపై తదుపరి చర్యలపై స్టే ఇచ్చింది.