12-03-2025 12:00:00 AM
ఎన్నికల కేసు కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన కేసులో మెదక్ ఎంపీ రఘునం దన్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం వెళ్లిన రఘునందన్‌రావు, అధికార యంత్రాంగం నుంచి అనుమతి లేకుండానే వుట్లపల్లి, పులిచెర్ల గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారని పెద్దవూర ఎంపీడీవో దుబ్బా శ్యామ్ చేసిన ఫిర్యాదు మేరకు 2021లో కేసు నమోదైంది.
ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులు విచారణ చేపట్టే ప్రత్యేక కోర్టులో కేసు విచారణలో ఉంది. ఈ కేసును కొట్టివేయలని కోరుతూ రఘునందన్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం విచారించారు. కింది కోర్టులోని కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో బీజేపీ నాయకుడిపై ఉన్న కేసును కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు.