calender_icon.png 8 January, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే కౌశిక్‌కెడ్డికి ఊరట

07-01-2025 01:58:56 AM

  1. కింది కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు
  2. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని దాఖలైన కేసులో  హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో సోమవారం ఊరట లభించింది. 2023 నవంబర్ 29న హనుమకొండ జిల్లా కమలాపుర్ పోలీస్‌స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

పోలీసులకు, కమలాపురం ఎంపీడీవో జీ బాబు తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈలోగా నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కేసుల విచారణ ప్రత్యేక కోర్టు విచారణకు కౌశిక్‌రెడ్డి హాజరుకానవసరం లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

‘మీరు నాకు ఓటు వేయకుంటే మా ముగ్గురు శవాలను చూడండి. మీరు ఓటు వేసి నాకు భారీ విజయం కల్పిస్తే విజయయాత్రకు వస్తాను. లేదంటే మా శవయాత్రకు మీరు రండి’ అని కౌశిక్‌రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో ప్రసంగించారంటూ వీడియో ఆధారంగా ఎంపీడీ వో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీడీ ఆధారంగా ఫిర్యాదు చేశారని, అయితే సీడీని పోలీసులు కోర్టుకు ఇవ్వలేదని, కేసుకు మూలమైన వీడియో లేకుండానే చార్జిషీట్ కూడా పోలీసులు దాఖలు చేశారని పిటిషనర్ లాయర్ వాదించారు. అయిగురు సాక్షులూ అధికారులేనని, ఒక్క ఓటరు కూడా లేరని చెప్పారు. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది.

అల్లు అర్జున్ సిబ్బంది ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సినీ నటుడు అల్లు అర్జన్ మేనేజర్ శరత్‌చంద్ర నాయుడు, పర్సనల్ సెక్యూరిటీ గారడ్స్ కృష్ణ, శ్రీరాములురాజు వేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును రిజర్వుచేసింది.

సోమవారం రెండు పక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది. హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో పుష్ప సిన్మా చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లినప్పుడు తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే.

ఆమె కొడుకు ఆస్పత్రిలో అపస్మారకస్థితిలో ఉన్నాడు. దీనిపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసులో మందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్లపై జస్టిస్ కే సుజన విచారణ పూర్తిచేశారు. వాదనలు పూర్తికావడంతో తీర్జును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించారు.