హైదరాబాద్(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)కి తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ఉపశమనం కలిగింది. గత ఏడాది హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్(Formula E-Car Racing) కేసులో తనను అరెస్ట్ చేయెద్దంటూ కేటీఆర్ హైకోర్టు ఆశ్రయించి క్వాస్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ పై మంగళవారం విచారించిన కోర్టు స్టేను పొడిగించింది. విచారణ సందర్భంగా కేటీఆర్(KTR) పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు ఆయను అరెస్ట్ చేయవద్దని ఏసీబీ(ACB)ని హైకోర్టు ఆదేశించింది. ఈ-కార్ రేసింగ్ లో రూ.55 కోట్ల నిధుల దుర్వినియోగం, నేరపూరిత నమ్మక ద్రోహం కింద ఏసీబీ తనపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో డిసెంబర్ 21న కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ తరుణంలో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని ఏసీబీ తరుపు న్యాయవాది ఎ.సుదర్శన్ రెడ్డి వాదిస్తూ, కేటీఆర్ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని ఏసీబీ కోర్టులో కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆరోపణలకు సంబంధించి కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు ఏసీబీ కస్టడీని కోరింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎంఏ అండ్ యూడీ) దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ ఇప్పటికే రికార్డు చేసింది. గత ఏడాది హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై కేటీఆర్‌పై డిసెంబర్ 19న ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అవినీతి నిరోధక చట్టం(Anti-Corruption Act)లోని సెక్షన్లు 13(1)(A), 13(2) కింద భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 409, 120(B)తో పాటుగా ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేయబడింది.