భూపాలపల్లి జిల్లా జడ్జి ఆర్డర్లపై హైకోర్టు స్టే
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటుకు అవినీతి, అక్రమాలే కారణమంటూ దాఖలైన ప్రైవేటు ఫిర్యాదు వ్యవహారంలో మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీశ్‌రావు కు హైకోర్టులో ఊరట లభించింది.
ప్రైవేటు ఫిర్యాదు లో కేసీఆర్, హరీశ్‌రావును నిందితులుగా పేర్కొనడం, వారిపై దర్యాప్తు జరపాలన్న అభ్యర్థనతో దాఖలైన ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలంటూ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి 2024 జూలై 10న తీసుకున్న నిర్ణయం అమలును నిలిపివేసింది. ఈ మేరకు హైకో ర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసిన నాగవల్లి రాజలింగమూర్తికి నోటీసు లు జారీచేస్తూ విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. ప్రైవేటు ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయగా, దీనిపై వేసిన రివిజన్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నిర్ణ యం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని కొట్టివేయాలని కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపడుతూ జిల్లా జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ జిల్లా జడ్జి నిర్ణయానికి కారణాలను వివరించారని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తనకు పరిధిలేని పక్షంలో సంబంధిత అవినీతి నిరోధక కోర్టుకు ఫిర్యాదును మేజిస్ట్రేట్ పంపాల్సి ఉందని, దానికి విరుద్ధంగా కొట్టివేశారని అన్నారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ ఫిర్యాదుపై విచారించే పరిధి తమకు లేదంటూ మేజిస్ట్రేట్ సరైన నిర్ణయమే తీసుకున్నారని చెప్పారు. ఒకసారి మేజిస్ట్రేట్ అంతిమ నిర్ణయానికి వచ్చినపుడు దానిపై రివ్యూ చేసే పరిధి సెషన్స్ జడ్జికి లేదన్నారు. రివిజన్ పిటిషన్‌పై విచారించే పరిధి తక్కువగా ఉందని తెలిపారు.
వాదనలను విన్న న్యాయమూర్తి ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే మేజిస్ట్రేట్ ఫిర్యాదును కొట్టివేయగా రివ్యూ పిటిషన్‌పై విచారణ చేపట్టాలంటూ జిల్లా జడ్జి తీసుకున్న నిర్ణయం సమర్థనీయం కాదని, అందువల్ల ఆ నిర్ణయం అమలుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
29 ఈసేవా కేంద్రాలు ప్రారంభం
న్యాయవ్యవస్థను డిజిటలైజేషన్ చేయడానికి, న్యాయసేవలను ప్రజలకు మరింత చేరు వ చేయడంలో భాగంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే మంగళవారం పలు జిల్లాల్లో మరో 29 ఈసేవా కేంద్రాలను ప్రారంభించారు. వీటితో కలిపి ప్రస్తుతం 97 ఈసేవా కేంద్రాలు సేవలు అం దిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయ మూర్తులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహంపై పిల్ ఉపసంహరణ
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల మార్పును సవాలు చేస్తూ రచయి త జూలూరి గౌరీశంకర్ దాఖలు చేసిన పిల్‌ను మంగళవారం ఉపసంహరించుకున్నారు. పూర్తి స్థాయి వివరాలతో పిటి షన్ దాఖలు చేయడానికి అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ తల్లి విగ్రహాల మార్పునకు సంబం ధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి క్యాబినెట్ నిర్ణయాన్ని, దానికయ్యే రూ.150 కోట్ల వివ రాలను ఎక్కడా ప్రస్తావించలేదనగా.. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది పూర్తి వివరాలతో మెరుగైన అఫిడవిట్ దాఖలు చేస్తామని, ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పారు. దీని కి అనుమతిస్తూ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
రాధాకిషన్‌రావుకు మధ్యంతర బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు రాధాకిషన్‌రావుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకుగాను ఈ నెల 25న ఉదయం 10 గంట ల నుంచి ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సికింద్రాబాద్‌లోని ఘటనా స్థలానికి ఎస్కార్ట్‌తో తీసుకెళ్లాలని, తిరిగి 28న జైలుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చంచల్‌గూడ జైలు సూపరిం టిండెంట్‌ను ఆదేశించింది.
అతని కుటుంబ సభ్యులను, సమీప బంధువులను కలవడానికి రాధాకిషన్‌రావును అనుమతించాలని సూచించింది. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు ఎస్కార్ట్ ఎలాంటి భంగం కలిగించకూడదని స్పష్టంచేసింది. ప్రయాణ ఖర్చులు, ఎస్కార్ట్ ఖర్చులు రాధాకిషన్‌రావు భరించాలని చెప్పింది.
జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తిరిగి జైలుకు వెళ్లే వరకు టెలిఫోన్, మొబైల్ వినియోగించరాదని షరతులు విధించింది. ఎస్కార్ట్ బెయిల్‌ను రాధాకిషన్ దుర్వినియోగం చేయవద్దని సూచించింది. ఫోన్ ట్యాపిం గ్ కేసులో అరెస్టయిన రాధాకిషన్‌రావు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించాల్సిఉంది. ఈ దశలో ఆయన మామ చనిపోవడంతో మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కే సుజన ఈ బెయి ల్ ఆదేశాలను జారీ చేశారు.