- అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు స్వీకరించండి
ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపులేని 217 కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన సుమారు 50 వేల మంది విద్యార్థులకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆయా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి ఎలాటి అపరాధ రుసుము వసూలు చేయకుండా సాధారణ పరీక్ష ఫీజు స్వీకరించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును ఆదేశించింది.
ఒక్కో విద్యార్థికి సంబంధించిన రూ.2,500 అపరాధ రుసుముకు ఆయా కళాశాలల యాజమాన్యాలు ఈనెల 28లోపు బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇంటర్మీడియట్ బోర్డుకు అగ్నిమాపకశాఖ ఎన్వోసీ సమర్పించని యాజమాన్యాలు శనివారంలోపు రూ.లక్ష చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. తెలిసిన వివరాల ప్రకారం..
ఇంటర్మీడియట్ బోర్డ్ విధించిన రూ.లక్ష జరిమానా మొత్తాన్ని మినహాయింపు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై జస్టిస్ టి.వినోద్‌కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘అగ్నిమాపకశాఖ ఎన్వోసీ సమర్పించేందుకు ఏడాదిపాటు గడువు ఇస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఏడాది దాటినా యాజమాన్యాలు ఎన్వోసీ సమర్పించలేదు. దీంతో ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కో కళాశాలకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. తర్వాత యాజమాన్యాలు విద్యార్థుల నుంచి సకాలంలో పరీక్ష ఫీజు స్వీకరించేందుకు వీలు కాలేదు. అందుకే విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించాలి. అపరాధ రుసుము నుంచి వారికి మినహాయింపు ఇవ్వాలి’ అని కోరారు.
అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ తన వాదనలు వినిపిస్తూ.. ‘గతేడాది నవంబర్ 24న ఇంటర్మీడియట్ బోర్డు ఫీజు చెల్లింపులకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు కొంత అపరాధ రుసుముతో డిసెంబర్ 3లో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నది.
అలాగే గడువు దాటినప్పటికీ ఒక్కో విద్యార్థి రూ.2 వేల వరకు అపరాధ రుసుము చెల్లించి ఈ ఏడాది జనవరి 2 లోపు ఫీజు చెల్లించవచ్చని, అలాగే ఒక్కో విద్యార్థి రూ.2,500 అపరాధ రుసుముతో ఈనెల 25లోపు చెల్లించవచ్చని ప్రకటించింది. కొన్ని కళాశాలలు ఎలాంటి గుర్తింపు లేకుండా విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చాయని, అందుకే జరిమానా విధించామని ఇంటర్మీడియట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.
అనమతులతో విద్యార్థుల ఫీజుతో ముడిపెడుతున్నది. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. కాలేజీల తరఫున అసోసియేషన్ పిటిషన్ వేసిందని, జరిమానాలు చెల్లించాల్సిన యాజమాన్యాలు మాత్రం కోర్టును ఆశ్రయించలేదని స్పష్టం చేశారు. అసలీ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందో లేదో కూడా తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ పరిస్థితుల్లోనూ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. సాధారణ ఫీజులు స్వీకరించాలని ఈమేరకు ఇంటర్మీడియట్ బోర్డుకు ఆదేశాలిస్తున్నామని తెలిపారు. యాజమాన్యాలు బ్యాంక్ గ్యారంటీలు సమర్పించాక, విద్యార్థులను వార్షిక పరీక్షలకు అనుమతించాలని సూచించారు. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు.