పీజీ అడ్మిషన్లలో అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): తెలంగాణ స్థానికత కలిగి గతంలో రాష్ర్టం వెలుపల ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఇన్‌సర్వీస్ వైద్యులకు పీజీ వైద్య విద్య అడ్మిషన్లలో అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇన్‌సర్వీస్ ఎంబీబీఎస్ వైద్యుల తరఫున అడ్వకేట్ శ్రీరామ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
తెలంగాణ స్థానికత కలిగి గతంలో ఉమ్మడి ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేవలం ఎంబీబీఎస్ మాత్రమే తెలంగాణ వెలుపల పూర్తిచేసి తిరిగి సొంత రాష్ర్టంలో సుదీర్ఘకాలం కాంట్రాక్ట్ వైద్యులుగా సేవలందిస్తున్నారని.. వారికి ఇన్‌సర్వీస్ పీజీ చేసేందుకు అర్హత ఉందని అన్నారు. తెలంగాణ స్థానికత ఆధారంగా రెగ్యులర్ ప్రభుత్వ సర్వీసులో చేరి దాదాపు ఆరు నుంచి పదేళ్ల పాటు ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు.
వాదనల తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇన్‌సర్వీస్ వైద్యుల అభ్యర్థనకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఎట్టకేలకు న్యాయం జరిగినందుకు ఇన్‌సర్వీస్ అభ్యర్థులు హర్షంవ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి దామోదర రాజనర్సింహకు తెలంగాణ పీజీ ఇన్‌సర్వీస్ వైద్యులు, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కత్తి జనార్దన్ ధన్యవాదాలు తెలిపారు.