calender_icon.png 24 September, 2024 | 7:56 AM

దుర్గంచెరువు నిర్వాసితులకు ఊరట

24-09-2024 03:10:55 AM

  1. అభ్యంతరాలు స్వీకరించాకే ఎఫ్‌టీఎల్ నిర్ధారించాలి
  2. 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ విచారణ
  3. కూల్చివేతలు ఉండవన్న హామీని ప్రభుత్వం అమలు చేయాలి: హైకోర్టు 

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం లోని దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణదారులు తమ అభ్యం తరాలను తెలియజేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశించింది. ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు సంబంధించి 2014లో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై గతంలోని అభ్యంతరాలు చెప్పిన పిటిషనర్లు తిరిగి ఆ విషయాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీకి నివేదించాలంది. ఈ మేరకు సోమవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.

అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు పిటిషనర్లు హాజరై అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలంది. అంతేగా కుండా ప్రభుత్వ రికార్డులకు చెందిన పత్రాలను కూడా అందజేయాలంది. పిటిషనర్లు అభ్యంతరాలు తెలియజేసిన తర్వాతే ఎఫ్టీఎల్‌ను నిర్ధారణ చేయాలని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యంతరాలు తెలియజేసిన ఆరు వారాల్లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎఫ్టీఎల్‌కు సంబంధించిన నిర్ణయాన్ని వెల్లడిం చాలంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూల్చివేత చర్యలు తీసుకోబోమన్న ప్రభుత్వ హామీని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట గ్రామం సర్వే నెం 47లో దుర్గం చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్‌ను నిర్ధారణ చేయకుండానే కూల్చివేతలకు నోటీసులు జారీ చేయడాన్ని అమర్ సొసైటీ ప్లాట్ ఓనర్ల అసోసియేషన్, మరో ఇద్దరు వేర్వేరుగా మూడు పిటిషన్లు వేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్, న్యాయవాది రాయ్‌రెడ్డి వాదించారు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లోని మ్యాప్ ప్రకారం దుర్గం చెరువు విస్తీర్ణం 65 ఎకరాలు ఉందని, అయితే చెరువు విస్తీర్ణం 160 ఎకరాలని అధికారులు నిర్ధారించడం అన్యాయమన్నారు.

బిల్డింగ్ రూల్స్ 2012లో రావడానికి ముందే హెచ్‌ఎండీఏ పర్మిషన్‌తో నిర్మాణాలు చేస్తే ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని చెప్పి కూల్చివేత నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఎఫ్టీఎల్ నిర్ధారణకు లేక్ ప్రొటెక్షన్ కమిటీ 2014 జూన్ 7న ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిందని, దీనిపై అప్పుడే పిటిషనర్లు 14 అభ్యంతరాలు చెప్పారన్నారు. అవి అలాగే ఉంచి కూల్చివేత చర్యలకు ఉపక్రమించడం చెల్లదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శ్రీధర్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ, చెరువలన్నింటి ఎఫ్టీఎల్‌ను 3 నెలల్లో నిర్ధారణ చేయాలని ఇదే హైకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు.

ఈ క్రమంలోనే ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాల కూల్చివేత చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, గతంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీకి సమర్పించిన అభ్యంతరాలను అక్టోబరు 4లోగా తిరిగి అందజేయాలని పిటిషనర్లను ఆదేశించింది. ఆ తర్వాత 6 వారాల్లోగా ఎఫ్టీఎల్ నిర్ధారణ విషయంపై నిర్ణయాన్ని వెల్లడించాలని కమిటీని ఆదేశించింది. ఈలోగా కూల్చివేత చర్యలు ఉండబోమన్న ప్రభుత్వ హామీని కచ్చితంగా అమలు పర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్లపై విచారణను మూసివేస్తున్నట్లు వెల్లడించింది.