మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, నవంబర్ 6 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు సామాన్య భక్తులకు ఎంతో ఊరటనిచ్చాయని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారటీ(వైటీడీఏ) ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు వివరాలను కచ్చితత్వంతో సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం సచివాలయంలో వైటీడీఏ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. వైటీడీఏ ఏర్పాటు, వైటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, భూసేకరణ, గత ప్రభుత్వ హయాంలో అర్థాంతరంగా అభివృద్ధి పనులు నిలిపేయడానికి గల కారణాలను వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావును అడిగి తెలుసుకున్నారు.
అసమగ్ర సమాచారం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించిన పరిపాలన అనుమతులు, డీపీఆర్‌ల సమర్పణ, బిల్లుల చెల్లింపు, భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపులు వంటి అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని గురువారం లోగా సమర్పించాలని ఆదేశించారు.
మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే యాదగిరిగుట్ట క్షేత్ర ప్రాశస్త్యం ఇనుమడించేలా చర్యలు చేపడుతూనే సామాన్య భక్తులకు కనీస సౌకర్యాల కల్పనకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నదని తెలిపారు. గుట్టను వైభవోపేతంగా తీర్చిదిద్దేం దుకు సమర్థకార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోతామని స్పష్టంచేశారు.
సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేఎస్ శ్రీనివాస్ రాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత్ కొండిబా, అడిషనల్ సెక్రటరీ కృష్ణవేణి, ఆర్జేసీ రామకృష్ణారావు, గుట్ట ఈవో భాస్కర్‌రావు పాల్గొన్నారు.