calender_icon.png 21 September, 2024 | 5:36 AM

సీఎం రేవంత్‌కు ఊరట

21-09-2024 01:31:03 AM

  1. ఓటుకు నోటు కేసును వేరే కోర్టుకు బదిలీ చేయం
  2. ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారు
  3. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఫిర్యాదును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు  

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేసును బదిలీ చేయాలన్న ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ పిటిషన్‌పై విచారణ ముగించింది. కేసు విచారణపై విశ్రాంత జడ్జి పర్యవేక్షణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. భవిష్యత్‌లో సీఎం జోక్యం చేసుకుంటే, దానిపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లొచ్చని తెలిపింది.

‘స్పష్ట మైన ఆధారాలు లేకుండా ఊహజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేపట్టాలి. కేసు విచారణలో సీఎం రేవంత్ జోక్యం చేసుకోకూడదు. సీఎం, హోంమంత్రికి, ఏసీబీ డీజీ రిపోర్టు చేయనక్కర్లేదు. విచారణ జరుగుతున్న దశలో జోక్యం చేసుకోలేం’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. విచారణ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. తమ తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు అందరికి ఉంటుందని, ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని పేర్కొన్నది. గతంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా చేసిన వ్యాఖ్యల విషయంలో రేవంత్‌రెడ్డి చెప్పిన క్షమాపణలను సుప్రీంకోర్టు అంగీకరించింది.