తొలి నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ సూచీలు
ముంబై, జూలై 5: ప్రపంచ ప్రతికూల సంకేతాల నడుమ శుక్రవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన మార్కెట్‌ను ట్రేడింగ్ ముగింపు సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఆదుకుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కొత్త రికార్డును నెలకొల్పింది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే దిగుమతులపై సుంకాలు పెంచుతారని, చైనా ఉత్పత్తులను నిషేధిస్తారన్న అంచనాల నడుమ శుక్రవారం ఆసియా మార్కెట్లు వెనుకంజ వేశాయి. ఫలితంగా ఉదయం సెషన్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా నష్టపోయి 79,478 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి మందగించిందన్న వార్తలతో ఆ షేరు భారీగా పతనంకావడమూ స్టాక్ సూచీలను దెబ్బతీసింది.
అయితే ట్రేడింగ్ ముగింపు సమయంలో ఆర్‌ఐఎల్ 3 శాతం మేర ర్యాలీ జరపడంతో సెన్సెక్స్ నష్టాల్ని గణనీయంగా తగ్గించుకోగలిగింది. చివరకు 53 పాయింట్ల నష్టంతో 79,997 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తొలుత 140 పాయింట్లకుపైగా క్షీణించి 24,168 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. అటుతర్వాత క్రమేపీ కోలుకుని 20,363 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది. చివరకు 22 పాయింట్ల లాభంతో 24,324 పాయింట్ల వద్ద ముగిసి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ స్థాయిలో నిఫ్టీ ముగియడం ఇదే ప్రధమం. నిఫ్టీ ఇండెక్స్‌లో 34 షేర్లు లాభపడగా, 16 షేర్లు నష్టాలతో ముగిసాయి. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 964 పాయింట్లు, నిఫ్టీ 313 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో టోక్యో, హాంకాంగ్, సియోల్‌లు పాజిటివ్‌గా ముగిసాయి. షాంఘై మార్కెట్ తగ్గింది. ప్రధాన యూరప్ మార్కెట్లయిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లు లాభపడ్డాయి.
రూ.21.5 లక్షల కోట్లకు ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నూతన రికార్డుస్థాయికి పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.21.5 లక్షల కోట్ల మార్క్‌ను చేరింది. ఆర్‌ఐఎల్ ఇంట్రాడేలో రూ.3,197 రికార్డు గరిష్ఠానికి చేరిన అనంతరం రూ.3,177 వద్ద ముగిసింది. తాజా పెరుగుదలతో కంపెనీ మార్కెట్ విలువ రూ.55,287 కోట్లు పుంజుకుని రూ.21,58,227 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని సబ్సిడరీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రెండింటి మార్కెట్ విలువ రూ.23,82,498 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.20 లక్షల కోట్ల మార్కెట్ విలువ సాధించిన తొలి భారత కంపెనీగా ఆర్‌ఐఎల్ నమోదయ్యింది. టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో అత్యధికంగా రూ.25,330 కోట్ల అడ్జస్టడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజీఆర్) సంపాదించిందని టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రకటించిన నేపథ్యంలో ఆర్‌ఐఎల్ తాజా ర్యాలీ జరిగిందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.
ఎస్బీఐ టాప్ గెయినర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగాస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 2.48 శాతం పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.32 శాతం పెరిగి ఆల్‌టైమ్ రికార్డుస్థాయి రూ.3,178 వద్ద ముగిగసింది. హిందుస్థాన్ యూనీలీవర్, ఎన్టీపీసీ, లార్సన్ అండ్ టుబ్రో, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫార్మాలు 1 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికంగా 4.5 శాతం మేర నష్టపోయింది. టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్‌లు 2 శాతం వరకూ తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో జోరుగా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.77 శాతం పెరిగింది.
ఎనర్జీ ఇండెక్స్ 1.70 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.55 శాతం, ఇండస్ట్రియల్స్ సూచి 1.48 శాతం, పవర్ ఇండెక్స్ 1.24 శాతం చొప్పున ఎగిసాయి. ఫైనాన్షియల్ సర్వీసుల ఇండెక్స్ 0.59 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచి0.43 శాతం, బ్యాంకెక్స్ 0.18 శాతం, ఐటీ ఇండెక్స్ 0.13 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 0.06 శాతం మేర తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.70 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.75 శాతం లాభపడింది. బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,185 షేర్లు లాభాలతో ముగియగా, 1,742 షేర్లు క్షీణించాయి.