ఐఎండీ తుపాను అంచనాలు ఇప్పుడు మన దేశానికే కాకుండా పొరుగు దేశాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రాంతంలోని 13 దేశాలు ఈ అంచనాలను ఉపయోగించి వారి తుపాను నిర్వహణ వ్యవస్థలను నిర్వహిస్తున్నాయి. ఐఎండీ మెరుగైన సామర్థ్యాలు దక్షిణాసియా ప్రాంతీయ వాతావరణ కేంద్రంగా గుర్తింపు పొందడానికి దారితీశాయి.
ప్రజా వాతావరణ సేవలను అందించే ఐఎండి (ఇండియా మెటిరోలాజికల్ డిపార్ట్‌మెంట్) ఇటీవల ( 2025 జనవరి 15) 150 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడంలో, వ్యవసాయం, నీటి నిర్వహణ, విమానయానం, ఇతర రంగాలకు మద్దతు ఇవ్వడంలో, దేశ సామాజిక ఆర్థికాభివృద్ధికి దోహదం చేయడంలో ‘భారత వాతావరణ విభాగం’ (ఐఎండీ) సేవలు కీలకపాత్ర పోషించాయి. ఐఎండి స్థాపన భారతదేశంలో వాతావరణ శాస్త్ర అభివృద్ధిలో ఒక కీలక ఘట్టం.
ఇది అన్ని వాతావరణ పనులను ఏకీకృత అథారిటీ కిందకు తీసుకువచ్చింది. ప్రారంభమైనప్పటి నుండి, వాతావరణ శాస్త్రాన్ని ఆధునిక భౌతిక శాస్త్రంగా అభివృద్ధి చేయడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషించింది. వాతావరణ అంచనా, వాతావరణ పర్యవేక్షణ, విపత్తు సన్నద్ధతను పెంపొందించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలను ఉపయోగిస్తూ నిరంతరం తన సామర్థ్యాలను మెరుగుపరుస్తూనే ఉంది. ఐఎండి ప్రారం భమైనప్పటి నుంచీ సంస్థ గణనీయమైన పురోగతిని సాధించింది. ఇది సృజనాత్మకత, సేవల మెరుగుదలపట్ల దాని నిబద్ధతను ప్రతిబింబిస్తున్నది.
150 ఏళ్ల కిందటే శ్రీకారం
కేంద్రీకృత వాతావరణ సేవల అవసరాన్ని నొక్కి చెప్పే వరుస విపత్కర సంఘటనల తర్వాత 1875లో ‘భారత వాతావరణ విభాగం’ (ఐఎండీ) స్థాపితమైంది. వీటిలో 1864లో వినాశకరమైన ఉష్ణమండల తుఫాను కలకత్తాను తాకింది. తరువాత 1866, 1871లలో ఋతు పవనాల వైఫల్యాలు వాతావరణ తీవ్రతలకు భారత ఉపఖండం బలహీనతలను ఎత్తి చూపాయి.
1865లో హార్బర్ హెచ్చరిక వ్యవస్థతో ప్రారంభమైన ఐఎండీ 1908లో వాతావరణ సేవలను 1911లో విమానయాన వాతావరణ సేవలు, 1928లో ఓజోన్ పర్యవేక్షణ, 1945లో వ్యవసాయ వాతావరణ సేవలను, 1955లో వాతావరణ పరిస్థితి శాస్త్రం, 1966లో మారిటైమ్ సర్వీసెస్ అండ్ ఫ్లడ్ మెటిరోలాజికల్ సర్వీసెస్, 1977లో హరికేన్ హెచ్చరిక, 1982లో అంటార్కిటికా యాత్ర, 1998లో హిమాలయాల కోసం మౌంటెన్ వెదర్ సర్వీసెస్, ఆపై ఐఎండీ ఆధునీకరణ కార్యక్రమం కింద 2006లో డిజిటలైజేషన్ అండ్ ఆటోమేషన్, ఇన్కోయిస్ సహకారంతో 2013లో తీరప్రాంత ముంపు,
2018లో ఐఐటీఎంతో వాయు నాణ్యత అంచనా, 2019 ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్‌కాస్టింగ్, 2020లో అర్బన్ వెదర్ సర్వీసెస్, జీఐఎస్ ఆధారిత అప్లికేషన్స్, 2020లోనే ఇంకా పలు సేవలను ప్రవేశపెట్టింది. దేశంలో డాప్లర్ రాడార్ల సంఖ్య 2014లో 15 నుంచి 2023లో 39కి పెరిగాయి.
వచ్చే అయిదేళ్లలో దేశంలో మొత్తం రాడార్ల సంఖ్య 86కు చేరుకుంటాయి. 2014లో 3,955గా ఉన్న వర్షపాత పర్యవేక్షణ కేంద్రాలు 2023 నాటికి 6,095కు పెరిగాయి. ఎగువ ఎయిర్ స్టేషన్లు 2014లో 43 నుంచి 2023లో 56కు పెరిగాయి. 117 విమానాశ్రయాలకు విమానయాన వాతావరణ పర్యవేక్షణ అంచనాతో సురక్షితమైన విమాన యానాన్ని నిర్ధారించడం ద్వారా ఐఎండీ గణనీయ సహకారాన్ని అందించింది.
తుపాన్లపై కచ్చితమైన అంచనాలు
ఫైలిన్ (2013), హుద్‌హుద్ (2014), ఫణి (2019), అంఫాన్ (2020), తౌక్టే (2021), బిపర్జోయ్ (2023), డానా (2024) వంటి తుపాన్లను విజయవంతంగా సంస్థ అంచనా వేయగలిగింది. ఐఎండీ కచ్చితమైన తుపాను హెచ్చరికల కారణంగా 1999లో 10,000గా ఉన్న మరణాల సంఖ్య 2020 నుంచి 2024 నాటికి సున్నాకు తగ్గింది.
2014తో పోలిస్తే, 2023లో మొత్తం అంచనా కచ్చితత్వంలో 40 శాతం మెరుగుదల కనిపించింది. ఆటోమేటిక్ రెయిన్ గేజ్‌ల (ఏఆర్‌జీ) సంఖ్య 2014లో 1350 ఉండగా, 2023 నాటికి 1382కు పెరిగింది. జిల్లాల వారీగా వర్షపాత పర్యవేక్షణ పథకం (డీఆర్‌ఎంఎస్) స్టేషన్ల సంఖ్య 2014లో 3955 ఉండగా 2023 నాటికి 5,896కుపెరిగాయి.
అందివచ్చిన దేశీయ సాంకేతికత
1958లో స్వదేశీ రాడార్‌తో ప్రారంభమైన స్వదేశీ సాంకేతికత అభివృద్ధిలో ముందు రన్నర్‌గా ఉంది. 1983 నుంచి ఇస్రో సహకారంతో భారతీయ ఉపగ్రహ ఉత్పత్తులను అందించింది. 1958లో స్వదేశీ రాడార్‌తో ప్రారంభమైన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, 1983 నుంచి ఇస్రో సహకారంతో భారత ఉపగ్రహ ఉత్పత్తుల అభివృద్ధిలో ఐఎండీ ముందంజలో ఉంది. 2000 నుంచి ఆటోమేటిక్ వెదర్ స్టేషన్, 2010 నుంచి డాప్లర్ వెదర్ రాడార్, 2019 నుంచి కామన్ అలర్ట్ ప్రోటోకాల్, 2019 నుంచి ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్‌కాస్ట్, 2022 నుండి డైనమిక్ కాంపోజిట్ రిస్క్ అట్లాస్‌లు రూపొందాయి.
ఐఎండీ తుపాను అంచనాలు ఇప్పుడు మన దేశానికే కాకుండా పొరుగు దేశాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రాంతంలోని 13 దేశాలు ఈ అంచనాలను ఉపయోగించి వారి తుపాను నిర్వహణ వ్యవస్థలను నిర్వహిస్తున్నాయి. ఐఎండీ మెరుగైన సామర్థ్యాలు దక్షిణాసియా ప్రాంతీయ వాతావరణ కేంద్రంగా గుర్తింపు పొందడానికి దారితీశాయి. ఐక్యరాజ్యసమితి ‘ఎర్లీ వార్నింగ్ ఫర్ ఆల్’ కార్యక్రమానికి సహకరించేందుకు ఐఎండీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కోసం 30 దేశాలను గుర్తించారు.
మరిన్ని సేవలు అందుబాటులోకి!
ఐఎండీ 150వ వార్షికోత్సవం సందర్భంగా డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, వాతావరణ పరిస్థితుల కారణంగా పంటనష్టాలను తగ్గించడానికి సహాయపడి రైతులకు అధిక ఉత్పత్తి, ఆదాయానికి దారితీసే పంచాయతీ వాతావరణ సేవలను అందించే సాంకేతికత, అన్ని రకాల వాతావరణ సంబంధిత సేవలను, వర్షాలు, పిడుగులు, తుపాను హెచ్చరికలు, విమానయానం, వ్యవసాయ వాతావరణ సలహాల కోసం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ జీఐఎస్ ఆధారిత ఇంటరాక్టివ్ మొబైల్ యాప్ ‘మౌసం’ను ఐఎండీ ప్రారంభించింది.
ఐఎండీ 1901 నుంచి అన్ని పరిశీలనా డేటాను డిజిటలైజ్ చేసింది. 2021లో భారత వాతావరణ శాఖ వివిధ వాతావరణ పారామితులు, విపరీత పరిస్థితులు, వాతావరణ ప్రమాదాలు, తీవ్రమైన వాతావరణ సంఘ టనలకు సున్నితమైన పటాలను వీక్షించడానికి ప్రజలకు విజువలైజేషన్ సాధనాలను ప్రవేశపెట్టింది.
2021 నుంచి ప్రతి నెల డైనమికల్ మల్టీ మోడల్ ఎన్సెంబుల్ క్లైమేట్ ఫోర్‌కాస్టింగ్ సిస్టమ్ ఆధారంగా వాతావరణ అంచనాలను అందిస్తుంది. వ్యవసాయం, హైడ్రాలజీ, విపత్తు రిస్క్ తగ్గింపు, ఆరోగ్యం, ఇంధన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో దేశంలో వాతావరణ సేవలు భారీగా విస్తరించాయి. అనేక విజయాలు సాధించినప్పటికీ వాతావరణ అనువర్తనా లను మరింత మెరుగు పరుచుకుని ముందుకు పోవలసిన అవసరం ఉంది.
డి.జె.మోహనరావు