calender_icon.png 22 September, 2024 | 7:00 PM

వివాహబంధంలోని ఔచిత్యం

20-09-2024 12:00:00 AM

బేతాళుడు ఇలా చెబుతున్నాడు-- 

“ఓ విక్రమాదిత్యా! పూర్వ కాలంలో చంపాకేశుడు, సులోచన అనే రాజదంపతులు ఉండేవారు. వారికి త్రిలోక సుందరి అనే కుమార్తె జన్మించింది. ఆమె ముఖం చంద్రబింబం వలె, కనుబొమలు ధనుస్సు వలె, హరిణి నేత్రాలతో, కోకిల కంఠంతో చూడ ముచ్చటగా ఉండేది.

త్రిలోకసుందరి స్వయంవరం ప్రకటితమైంది. రాజులు, మహారాజులే కాకుండా దేవతలు కూడా మానవ రూపాలలో వచ్చారు. 

ఒక యువరాజు చంపకేశునితో ఇలా అన్నాడు-

“ఓ రాజా! నేను సకల శాస్త్రాలలో దిట్టను. మీ పుత్రికను నాకు సమర్పించండి”. 

రెండవ యువరాజు ఇలా అన్నాడు- 

“రాజా, నేను ధనుర్విద్యలో నిష్ణాతుణ్ణి. కనుక, త్రిలోక సుందరిని నాకిచ్చి పెళ్లి చేయండి”. 

మూడవ అతను చెప్పాడిలా--

“రాజా! నేను వ్యాపారవేత్తను, ధనికుణ్ణి. కాబట్టి, మీ కుమార్తెను నాకివ్వండి”. 

నాలుగవ వ్యక్తి మాటలు ఇలా ఉన్నాయి-

“ఓ రాజా, నేను కొలువు చేస్తూ వచ్చిన సంపాదనలో నుంచి దానధర్మాలు చేస్తున్నాను. అందువల్ల నేను మీ అమ్మాయికి తగినవాణ్ణి అనుకుంటున్నాను..”

వీళ్లందరి గుణగణాలను విన్న రాజు తన పుత్రిక అయిన త్రిలోక సుందరి మనోవాంఛితాన్ని కూడా తెలుసుకోవాలని అనుకున్నాడు. అడిగాడు, కానీ సిగ్గుతో ఆమె ఏమీ చెప్పలేకపోయింది.

బేతాళుడిలా పలికాడు,-“ ఓ రాజా! ఆ కన్యకు యోగ్యుడైన వరుడెవరో మీరు చెప్పండి?”

విక్రమాదిత్యుడిలా చెప్పాడు-- 

“రుద్రకింకరా! శాస్త్రాలలో నిష్ణాతుడు బ్రాహ్మణుడు, వ్యాపారవేత్త వైశ్యుడు, కొలువు చేస్తున్న వ్యక్తి శూద్రుడు. ధనుర్విద్యలో నిష్ణాతుడు క్షత్రియుడు. ఆమె క్షత్రియ జాతికి చెందింది కనుక, త్రిలోక సుందరి అతనికే చెందాలి”.

(‘భవిష్య పురాణం’ నుంచి..)

- యం.వి.నరసింహారెడ్డి