calender_icon.png 14 October, 2024 | 5:49 PM

కనికరం లేని బ్యాంకులు

20-08-2024 12:30:00 AM

  1. వయనాడ్ బాధితుల పరిహారం నుంచి ఈఎంఐలు కట్ 
  2. రుణాలు మాఫీ చేయండి 
  3. బ్యాంకులకు కేరళ సీఎం విజయన్ విజ్ఞప్తి

వయనాడ్: వయనాడ్ బాధితులకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అత్యవసర సాయం కింద రూ.10 వేలు అందించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలుప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో వందలమంది ప్రాణాలు కోల్పోయారు.ఈ మొత్తా న్ని నేరుగా బాధితుల కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే, ఈ సొమ్ము నుంచే కేరళ గ్రామీణ బ్యాంకు ఈ నెల ఈఎంఐలను కట్ చేసుకుంది. దీనిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. వయనాడ్ వరదల బాధితుల రుణాలను రైటాఫ్ చేయాలని వివిధ బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు.

దీని వల్ల బ్యాంకులపై పెద్ద భారమేమీ ఉండదని వ్యాఖ్యానించారు. వెంటనే రుణాలను రైటాఫ్ చేసే దిశగా చర్యలు తీసుకో వాలని కోరారు. వడ్డీ మొత్తంలో మినహాయింపు, వాయిదాల చెల్లింపునకు గడువు పొడిగించడం వంటి చర్యల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీసుకున్న రుణాలను రైటాఫ్ చేయడమొక్కటే పరిష్కారమని తెలిపారు. ఈ సమయంలో బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి లోన్ ఈఎంఐలు తీసుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేరళ గ్రామీణ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి నేరుగా 50 శాతం, పీఎస్‌యూ కెనరా బ్యాంకు ద్వారా మరో 35 శాతం వాటా ఉంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి 15 శాతం వాటా ఉంది. బ్యాంకులు ఇలా వరద సాయం నుంచి ఈఎంఐలు తీసుకోవడాన్ని కేరళ రాష్ట్ర సహకారశాఖ మంత్రి వీఎన్ వాసవన్ సైతం తప్పుబట్టారు. దీన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. సాయం మొత్తం తమ ఖాతాల్లో జమయిన వెంటనే రూ.5,000 ఈఎంఐ కట్ అయ్యిందని చాలా మంది బాధితులు మీడియాకు తెలియజేశారు.

ఈ విషయాన్ని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) దృష్టికి తీసుకెళ్తామని మంత్రి వాసవన్ తెలిపారు. బ్యాంకులు మానవతా దృక్పథంతో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాల్సిందని హితవు పలికారు. కానీ, అది జరగలేదని,ఎస్‌ఎల్‌బీసీ సైతం దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి స్థానిక గ్రామీణ బ్యాంక్ చీఫ్‌తో చర్చించామని ఎస్‌ఎల్‌బీసీ జనరల్ మేనేజర్ కేఎస్ ప్రదీప్ తెలిపారు.

విపత్తు సంభవించడానికి ముందే ఇచ్చిన స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ వల్లే ఈ పొరపాటు జరిగినట్లు వివరించారు. మరోవైపు వరద సాయం నుంచి తీసుకున్న ఈఎంఐ మొత్తాన్ని తిరిగి బాధితుల ఖాతాల్లో జమ చేయాలని వయనాడ్ డిప్యూటీ కలెక్టర్ గ్రామీణ బ్యాంకుకు ఆదేశాలు జారీ చేశారు.గత జులై 30న కొండచరియలు విరిగిపడి వయనాడ్ జిల్లాలోని ముండక్కై, చురాల్మల తదితర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.