calender_icon.png 9 March, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బందీలను విడుదల చేయండి

07-03-2025 12:00:00 AM

లేదంటే నరకం అనుభవించాల్సి ఉంటుంది

హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఖరి హెచ్చరిక

ఒప్పందం నుంచి ఇజ్రాయెల్‌ను తప్పించేందుకే ఈ హెచ్చరికలన్న హమాస్

శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాకే బందీలను విడుదల చేస్తామని స్పష్టీకరణ 

వాషింగ్టన్, మార్చి6: 6: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు చిట్టచివరి హెచ్చరికలు జారీ చేశారు. గాజాలో మిగిలిపోయిన మిగతా బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని, లేకుంటే నరకం అనుభవించాల్సి ఉంటుందని తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు. “‘షాలోమ్ హసామ్‌” అంటే హలో, గుడ్‌బై.. దీనిలో మీరు ఏది ఎంచుకుంటారు. తర్వాత కాదు, బందీలందరినీ ఇప్పుడే విడుదల చేయండి. అలాగే మీరు హత్య చేసిన వారి మృతదేహాలను కూడా వెంటనే అప్పగించండి. లేకపోతే మీ పనైపోతుంది.

మానసిక ఆరోగ్యం బాగాలేని వాళ్లు మాత్రమే మృతదేహాలను తమ వద్ద ఉంచుకుంటారు. మీరు మానసికంగా అనారోగ్యులు. మీ పని పూర్తి చేయడానికి అవసరమైన ప్రతిదాన్ని ఇజ్రాయెల్‌కు నేను పంపుతున్నా. నేను చెప్పింది చేయకపోతే, హమాస్‌కు చెందిన ఒక్క సభ్యుడు కూడా మిగిలి ఉండడు’ అని తన పోస్టులో ట్రంప్ పే ర్కొన్నారు. అంతేకాకుండా ‘మీ చెరలో బతుకులు నాశనమైన బందీలను నేను కలిశాను. హమాస్ నాయకత్వానికి ఇదే నా చివరి హెచ్చరిక, మీరు గాజా ను వీడే సమయం వచ్చింది.

గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు ఎదురుచూస్తోంది. కానీ మీరు బందీలను విడుదల చేయకుంటే మాత్రం ఇది జరగదు. బందీలను విడుదల చేయకుంటే మీరంతా చ స్తారు. మంచి నిర్ణయం తీసుకోండి. బందీలను వెం టనే విడుదల చేయండి లేదంటే నరకాన్ని అనుభవిస్తారు’ అని ట్రంప్ హెచ్చరించారు. బందీలను విడు దల చేసే విషయంలో హమాస్ నేతలతో అమెరికా ప్రభుత్వ ప్రతినిధి ప్రత్యక్షంగా చర్చలు జరిపినట్టు శ్వేతసౌధం ప్రకటించింది. ఆ తర్వాత ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. 

ముగిసిన తొలిదశ ఒప్పందం గడువు

ఇజ్రాయెల్ మధ్య ఇటీవల తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం గడువు శనివారంతో ముగి సింది. దీన్ని పొడగించాలని, అందులో భాగంగా హమాస్ తన చెరలో బందీలుగా ఉన్నవారిలో సగం మందిని విడుదల చేయాలని అమెరికా ప్రతిపాదించింది. దీనికి ఇజ్రాయెల్ ఒప్పుకోగా.. హమాస్ నిరాకరించింది. ఈ క్రమంలోనే హమాస్‌ను 1997లో ఉగ్రసంస్థగా అమెరిగా గుర్తించినప్పటికీ.. బందీల కోసం ప్రత్యేకంగా నియమించిన అమెరికా ప్రతినిధి ఆడమ్ బోహ్లార్ దోహా వేదికగా హమాస్ నేతలో చర్చలు జరిపారు. అమెరికా ప్రతిపాదనలను హమాస్ నిరాకరించిన క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ చిట్టచివరి హెచ్చరికలు జారీ చేశారు.  

ఇజ్రాయెల్‌ను తప్పించేందుకే..

డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చిరికలపై హమాస్ స్పందించింది. గాజా కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తప్పుకోవడానికి సాయం చేయడంలో భాగంగానే పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ట్రంప్ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారని హమాస్ ఆరోపించింది. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పుడే మిగిలిన బందీలను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది. రెండో దశ ఒప్పందం కోసం చర్చలు జరపాలని పేర్కొంది. తాము విడుదల చేస్తున్న బందీలకు బదులుగా ఎక్కువ సంఖ్యలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడంతోపాటు, గాజా నుంచి ఇజ్రాయెల్ వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేసింది. బందీలను విడిపించుకోవడానికి చర్చలే సరైన మార్గమని పేర్కొంది.