బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, డిసెంబర్ 2(విజయక్రాంతి): ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కుట్రలు పన్నుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తేస్తే తెలంగాణ ఉద్యమం తరహాలో పెద్దఎత్తున మరో విద్యార్థి ఉద్యమం తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని విద్యానగర్ బీసీ భవన్‌లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఫీజు దీక్షను చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. 4వేల కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్, నాయకులు సీ. రాజేందర్, అనంతయ్య, నందగోపాల్, మధుసూదన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.