calender_icon.png 25 October, 2024 | 7:59 AM

పెండింగ్ బిల్లులు విడుదల చేయండి

25-10-2024 12:00:00 AM

తెలంగాణలో గత సంవత్సరం చివర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్ప డింది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీల పేరుతో ప్రజాసమస్యలు పరిష్కరిస్తామని, మెరుగైన పాలన అందిస్తామని ప్రజల ఓట్లతో అధిక సీట్లను పొంది కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది.

అధికారంలో కొచ్చి 10 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పాలన అందించడంలో, ప్రభుత్వ ప్రతిష్టను పెంచడంలో అహర్నిశలు కష్టపడుతున్న ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం చేయక పోగా, వారు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేదు. పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లులు, పిఆర్సీ, హెల్త్ కార్డులు.. ఇలా అనేక సమస్యలతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆర్థికంగా సతమతమవుతున్నారు.

అంతేకాదు, కాంట్రాక్టర్లు సైతం వారు చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయక పోవడంతో అనేకమంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు చూశాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలనుంచి ఆర్థికశాఖకు వస్తున్న బిల్లులకు సొమ్ము విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. పలు రకాల అభివృద్ధి పనులకు సంబంధించిన వాటితోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన డబ్బులు విడుదల కావడం లేదు.

ఉద్యోగులు పెట్టుకునే సరెండర్ లీవ్, వైద్యఖర్చులు, జీపీఎఫ్ రుణాలు, పొదుపు నిధులు తదితర బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. అంతేకాదు, వాళ్లు పొదుపు చేసుకున్న డబ్బులనూ వారి అత్యవసరాలకు, పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు, ఆపత్కాలంలో వైద్య ఖర్చులకు ఉపయోగపడాల్సిన పొదుపు బిల్లులు కూడా విడుదల కావడం లేదు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొత్తం పెండింగ్ బిల్లులు రూ. 40 వేల కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు ప్రభుత్వం శాసనసభకు తెలిపింది. వీటిలో రూ. 10 లక్షలలోపు బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినా కనీసం రూ. లక్షకూడా చాలా కాలంగా మంజూరు కావడం లేదని పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతోపాటు కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

గతంలో చిన్న బిల్లుల టోకెన్లకు నేరుగా ఖజానా శాఖనే నిధులు విడుదల చేసేది. గత ప్రభుత్వ కాలం నుంచి నిధుల కొరత వల్ల ప్రతి టోకెన్ సచివాలయంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి ఉండాలని నిబంధన పెట్టింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు తమ నిధులు విడుదల చేయాలని ప్రతిరోజు పెద్దసంఖ్యలో ఆర్థిక శాఖకు వచ్చి విన్నవిస్తున్నారు. వీరికి సమాధానం చెప్పలేక అక్కడి ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. 

 మేకిరి దామోదర్, వరంగల్