calender_icon.png 2 February, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెబ్రోన్‌ చర్చి సంక్షోభంపై శ్వేత పత్రం విడుదల..

01-02-2025 10:12:36 PM

ముషీరాబాద్‌ (విజయక్రాంతి): ఇటీవల కాలంలో గోల్కొండ చౌరస్తాలోని ప్రతిష్టాత్మక హెబ్రోన్‌ చర్చిలో జరుగుతున్న పరిణామాలపై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ మేరకు శనివారం ముషీరాబాద్ లోని కశిష్‌ ఫంక్షన్‌హాల్‌లో ప్రవీణ్‌ పగడాల అధ్యక్షతన నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చర్చిల ప్రతినిధులు సమావేశమైయ్యారు. అనంతరం ఇండిపెండెంట్‌ చర్చస్‌ అధ్యక్షులు డాక్టర్‌ వై.మోహన్‌బాబు మాట్లాడారు. హెబ్రోన్‌ చర్చి వ్యవస్థాపకులు బ్రదర్‌ భక్తసింగ్‌ 1971 సంవత్సరంలో ప్రభుత్వ లావాదేవీల నిమిత్తమై ఎనిమిది మందితో కూడిన ఒక సోసైటీని ఏర్పాటు చేశారని కాలక్రమేనా ఎవరికి ఏ విధమైన బాధ్యత అప్పజెప్పకుండా అందరూ మరణించారని తెలిపారు. కొంత కాలానికి 2000 సెప్టెంబర్‌ 17వ తేదీన బ్రదర్‌ భక్తసింగ్‌ కూడా మరణించారని ఆ తరువాత 2004 సంవత్సరంలో భక్తసింగ్‌తో కలిసి పని చేసిన బ్రదర్‌ ఫిలిప్‌ అధ్యక్షతన ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేశారని తెలిపారు.

ఫిలిప్‌ కూడా 2013 సంవత్సరంలో మరణించడంతో దానిని అదునుగా తీసుకున్న కొందరు కోర్టుకు వెళ్లి సోసైటీ ఇంకా చలామణీలో ఉంది కాబట్టి ట్రస్ట్‌కు ఏవిధమైన బాధ్యతలు లేవని కోర్టు ఆర్డర్‌ పుట్టించారని ఇదే అన్ని సమస్యల ప్రారంభానికి దారి తీసిందని తెలిపారు. అయితే హెబ్రోన్‌ చర్చితో సంబంధం లేని, నేర చరిత్ర కలిగిని రాగి వీరాచారి అనే వ్యక్తి నకిలీ పత్రాలను సష్టించి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆమోదం కోసం సమర్పించారన్నారు. అయితే అవి ఇంత వరకు సంబంధిత కార్యాలయం అధికారులచే ఆమోదించబడలేదని కానీ ఈ నకిలీ పత్రాలను కోర్టుకు చూపి ఒక ఇంజక్షన్‌ ఆర్డర్‌ను తెచ్చుకోని 2017వ సంవత్సరంలో సంఘాన్ని ఆదీనంలోకి తీసుకున్నారని తెలిపారు. దీన్ని ద్వారా ఏడు సంవత్సరాలు అంటే 2024 వరకు కోనసాగి విశ్వాసులను బెదిరిస్తు సంఘంలో వచ్చిన ఆదాయాన్ని అక్రమంగా ఆర్జిస్తున్నా ఎవరు పట్టించుకోలేదన్నారు.

2024 సెప్టెంబర్‌ 1వ తేదీన వీరాచారి అనే వ్యక్తిని హెబ్రోన్‌ చర్చి నుంచి బయటకు పంపించడం జరిగిందని అప్పటి నుంచి శాంతియుతంగా చర్చి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. హఠాత్తుగా 2025 జనవరి 23వ తేదీన వీరాచారి అతడి వంద మంది అనుచరులు చర్చిలో చోరబడి సంఘపు వ్యక్తులపై దాడి చేసి 1.17 కోట్ల సొమ్మును తీసుకువెళ్లారని ఆరోపించారు. ఇప్పటికి వీరాచారి దౌర్జన్యంగా చర్చిలోనే ఉన్నాడని తెలిపారు. వీరాచారి అనే వ్యక్తిని చర్చి నుంచి బయటకు పంపాలని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే హెబ్రోన్‌ చర్చి కార్యక్రమాలు సజావుగా సాగడానికి స్వయం ప్రతిపత్తి కలిగిన పెద్దలతో కమిటి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రెవరెండ్‌ భాస్కరాయా, బిషప్‌ జాన్‌ గొల్లపల్లి, రెవరెండ్‌ ప్రసాద్‌ చౌదరి, రెవరెండ్‌ జోనాతన్‌ ఎడ్‌వార్డ్స్, రెవరెండ్‌ డాక్టర్‌ గేరా ఇసాక్, బ్రదర్‌ జాన్‌ స్టివర్ట్‌ తదితరులు పాల్గొన్నారు.