హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): ప్రఖ్యాత గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ హిందీలో స్వరపరిచి, ఆలపించిన ‘గేయ రామాయణాన్ని’ విదుర్ ఆశ్రమ పీఠాధిపతి కుమారానందగిరి మహారాజ్ అయోధ్యలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహారాజ్ మాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్ రామాయణాన్ని 17 నిమిషాల నిడివిలో గేయ రూపంలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా రూపొందించడం అభినందనీయమన్నారు.
అలాగే రచించిన కల్నల్ తిలక్‌రాజ్ జలంధర్‌ను అభినందించారు. డా.గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గేయ రామాయణం అయోధ్యలో ఆవిష్కరించడం తన పూర్వ జన్మ సుకృతమని, 5 వేల ఏళ్ల ఘన చరిత్రలో గిరి సంప్రదాయం కలిగిన విదుర ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీ కుమారానందగిరి మహారాజ్ దివ్య హస్తాలతో గేయ రామాయణం లోకార్పణం కావడం గొప్ప దివ్యానుభూతి అన్నారు. కార్యక్రమంలో రాజ్ త్రిపాఠి, అంకిత్ తివారి, బుల్బుల్ పాండే, మెడికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.