calender_icon.png 23 September, 2024 | 1:51 PM

భూనిర్వాసితులకు బకాయిలు విడుదల

23-09-2024 01:12:34 AM

రంగారెడ్డి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కల్వకుర్తి ఎత్తిపోతల పథక (కేఎల్‌ఐ) భూనిర్వాసితులకు సర్కార్ రూ.17.50 కోట్ల బకాయిలను విడుదల చేసినట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కేఏల్‌ఐ పనుల్లో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం జంగారెడ్డిపల్లి నుంచి మాడ్గుల మండలం నాగిళ్ల వరకు సర్కార్ డీ ఉప కాల్వల పనులు చేపట్టిందన్నారు. కానీ గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని పేర్కొన్నారు.  తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో భూపరిహారం ఇప్పించాలని నాటి ప్రభుత్వానికి తీసుకెళ్లినా ప్రయోజన లేకపోయిందన్నారు. సమస్యను కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిహారం గురించి పట్టించుకున్నారన్నారు. వెంటనే పరిహారం విడుదల చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారన్నారు.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం..

రైతులకు పరిహారం విడుదలైనందుకు గాను ఆదివారం రాష్ట్ర పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులు ఆమనగల్లు మండల కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి అని కొనియాడారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వెళ్తున్న రీజినల్ రింగ్ రోడ్డు విషయమై బీఆర్‌ఎస్ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి కుటుం బంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, సీఎంపై ఆరోపణలు సరికాదని హితవు పలికారు. పనిగట్టుకొని సీఎంపై బురదజల్లడం హేయమైన చర్య అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు జగన్, శ్రీనివాస్‌రెడ్డి, ధనుంజయ, భాస్కర్‌రెడ్డి, బిక్యానాయక్, మోహన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, డిగ్రీ కృష్ణయ్య పాల్గొన్నారు.