calender_icon.png 22 October, 2024 | 5:59 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక డీఏల విడుదల!

22-10-2024 02:35:04 AM

  1. 17 శాతం పెరగనున్న మూలవేతనం
  2. ప్రభుత్వ పరిశీలనకు ఆర్థికశాఖ ప్రతిపాదనలు
  3. 26న జరిగే క్యాబినెట్ భేటీలో నిర్ణయం?

బూడిద సుధాకర్ :

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): దీపావళికి ముందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త వినబోతున్నారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ (డియర్‌నెస్ అలవెన్స్/కరువు భత్యం) లను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థికశాఖ అధికారులు ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న క్యాబినెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మూలవేతన ప్రతిపాదనలపై క్యాబినెట్ ఆమోదముద్ర వేయనుంది.

డీఏ విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలోని సుమారు 3,00,178 మంది పైచిలుకు ఉద్యోగులకు, 2.88 లక్షల ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్లకు కరువుభత్యం రూపంలో ప్రయోజనం జరుగనుంది. ఐదు డీఏలను విడుదల చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం 17 శాతం పెరిగే అవకాశం ఉంది.

ప్రభుత్వ ఉద్యోగుల జీతం నిర్మాణంలో కీలకమైన అంశం డీఏ. నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆరునెలలకు ఒకసారి డీఏను సవరించాల్సి ఉంటుంది. రాష్ర్ట ప్రభుత్వం చివరిసారిగా 2023 జూలై 19న డీఏను (2022 జనవరి 1 నుంచి వర్తించేలా) సవరించింది. దీంతో అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం 2.73శాతం పెరిగింది.

ఆ తరువాత రాష్ర్ట ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల డీఏలో ఎటువంటి సవరణ చేయలేదు. కానీ, కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువు ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి (జూలై 2022, జనవరి 2023, జూలై 2023, జనవరి 2024)లో  ప్రభుత్వ ఉద్యోగుల డీఏను సవరించడంతో ఉద్యోగుల మూల వేతనం 16 శాతం పెరిగింది. 

పెండింగ్‌లో ఐదు డీఏలు..

రాష్ర్టంలో ఉద్యోగుల ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2022 జూలైలో 3.64 శాతం, 2023 జనవరిలో 3.64 శాతం, 2023 జూలైలో 3.64 శాతం, 2024 జనవరిలో 3.64 శాతం, 2024 జూలైలో 2.73 శాతం డీఏ పెరగాల్సి ఉంది. ఈ ఐదు డీఏల విడుదలతో ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం 17.29 శాతం పెరుగుతుందని ప్రభుత్వ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత కాలంలో డీఏలను విడుదల చేయని కారణంగా రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు ఒక కాలానికి 3.64% చొప్పున మొత్తంగా 17.29శాతం డీఏను నష్టపోవడం జరిగింది. ఈ జాప్యం వలన రూ.50వేల రూపాయలు బేసిక్ వేతనంగా ఉన్న ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగి నెలకు రూ.7,280 రూపాయలను జనవరి 2024 నుంచి 10 నెలలుగా నష్టపోతూనే ఉన్నారు.

దీంతో చిన్న ఉద్యోగి కూడా పెద్ద మొత్తంలో వేతనాన్ని నష్టపోవడం జరుగుతుంది. అయితే ఉద్యోగులకు నిర్ణీత సమయంలో డీఏ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీయడమేనని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల వినతి

దసరా కానుకగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు సీఎం సలహాదారుడు వేంరెడ్డి నరేందర్ రెడ్డికి దసరాకు ముందు వినతి పత్రం అందించారు. అలాగే సచివాలయ ఉద్యోగులు తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ (టీఎస్‌ఎస్‌ఏ) జనరల్ సెక్రటరీ ప్రేమ్ ఆధ్వర్యంలోనూ నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారికి వినతి పత్రం అందించారు.