79.57 కోట్లు.. ఎకరానికి 10 వేలు
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): భారీ, అతి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో 79,216 మంది రైతులకు చెందిన 79,574 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు నిర్ధారించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నెల రోజుల వ్యవధిలోనే పంట నష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ.79.57 కోట్లను విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.
అత్యధికంగా ఖమ్మం జిల్లాలలో 28,407 ఎకరాలు, మహబూబాద్ జిల్లాలో 14,669 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 9,288 ఎకరాలు, మిగతా జిల్లాల్లో అత్యల్పంగా 19 ఎకరాల నుంచి 3,288 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మంత్రి తుమ్మల తెలిపారు. ఎకరానికి రూ. 10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.