calender_icon.png 18 October, 2024 | 3:45 PM

సింగరేణి సంస్థ రక్షణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి

27-07-2024 03:53:02 PM

బొగ్గు రంగ సంస్థ రక్షణ కోసం జిల్లాలో సీపీఎం బస్సు జాత

మంచిర్యాల, విజయక్రాంతి : సింగరేణి సంస్థ రక్షణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోమాస ప్రకాష్ డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి బొగ్గు బావుల పరిరక్షణకై జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనులను వేలం వేస్తున్నదని, దేశ సహజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించబోతున్నదన్నారు.

సింగరేణి ప్రాంతంలోని మన మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును  కూడా వేలంలో పెట్టిందని, సింగరేణి కూడా ప్రైవేటు సంస్థలతో పోటీ పడాలని అంటున్నదని, ఈ విధానాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు. తెలంగాణలో బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపాలని సీపీఎం అధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రను 2024 జులై 29 నుండి ఆగస్టు 5 వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ యాత్రలో వామపక్ష పార్టీలు,ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత ,   సామజిక  సంఘాలు పాల్గొని జయప్రదం చేయలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో, దుంపల రంజిత్ కుమార్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, మహేష్, మోహన్ సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.