- విడతల వారీగా మాజీ సర్పంచులకు అందజేస్తాం
- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్‌ఎస్సే కారణం
- 15వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా రాలేదు
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): మాజీ సర్పంచులకు మార్చి 31 వరకు విడతల వారీగా పెండింగ్‌లో ఉన్న బిల్లును విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మాజీ సర్పంచుల బాధలు తమకు తెలుసని, కానీ ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో పడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం సూచించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పాపం వల్లే మాజీ సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులకు గురై ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో అందరికి తెలుసని, అందుకే ఓపిక పట్టాలని కోరుతున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో సర్పంచుల బిల్లుల కోసం బీఆర్‌ఎస్ మాట్లాడటం వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉందని మండిపడ్డారు. సర్పంచులకు తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. మూసీపరివాక ప్రాంతాల ప్రజలను బీఆర్‌ఎస్ రెచ్చగొట్టే కార్యక్రమం ముగిశాక.. తాము న్యాయం చేయడానికి వెళతామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్‌ఎస్సే కారణం: సీతక్క
బిల్లులు చెల్లించకుండా సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్‌ఎస్ పార్టే కారణమని మంత్రి సీతక్క ఆరోపించారు. అలాంటి బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు సర్పంచులకు బిల్లులు చెల్లించాలని ఆందోళన చేయడం చంపినోడే తద్దినం పెట్టినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. సోమవారం సచివాలయంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సర్పంచుల మీద ప్రేమ ఉన్నట్టుగా హరీశ్‌రావు సన్నా యి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఆర్థికశాఖ మంత్రిగా హరీశ్ ఉన్నప్పుడే బిల్లులు పెండింగ్‌లో పెట్టారనే విషయం మాజీ సర్పంచులకు తెలుసునని స్పష్టం చేశారు. అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ బిల్లులతోపాటు ఇతర బిల్లులను చెల్లించుకుంటూ వస్తున్నామని, ఇప్పటికే పెండిం గ్‌లో ఉన్న రూ.580 కోట్ల బిల్లులను ఇప్పటికే చెల్లించామని తెలిపారు. బిల్లులు పెండింగ్‌లో పెట్టిన కేసీఆర్, హరీశ్‌రావు ఇళ్ల ముందు ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. 15 ఆర్థిక సంఘం నిధులు, కేంద్రం రావాల్సిన నిధులు ఇంకా రాలేదని వెల్లడించారు.
జరిగిన పనులకు బిల్లులు చెల్లిస్తా మని చెప్పారు. బీఆర్‌ఎస్ రాజకీయ కుట్ర ల్లో మాజీ సర్పంచులు బలి కావద్దని హిత వు పలికారు. మాజీ సర్పంచులు ఆందోళన చెందొద్దని, అన్ని బిల్లులను క్లియర్ చేస్తామని స్పష్టం చేశారు.