calender_icon.png 25 October, 2024 | 7:09 AM

విడుదల తేదీలివే..

19-07-2024 03:49:51 AM

పలు నిర్మాణ సంస్థలు తమ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించాయి. దీంతో సినీ ప్రియుల్లో ఆయా చిత్రాలపై మరింత ఆసక్తి పెరిగినట్టయింది. తాజా సమాచారం ప్రకారం గురువారం మూడు సినిమాలకు సంబంధించి రిలీజ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. రక్షిత్ అట్లూరి హీరోగా, రాధికా శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘ఆపరేషన్ రావణ్’. సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకట సత్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 2న విడుదల చేయనున్నట్టు గతంలో మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఆ తేదీలో మార్పు చేస్తూ ముందే వస్త్నున్నట్టు వెల్లడించారు. ఈ నెల 26న విడుదల చేయనున్నట్టు మేకర్స్ గురువారం తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్; మాటలు: లక్ష్మీ లోహిత్ పూజారి; ఫైట్స్: స్టంట్ జాషువా; ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి. 

దీపావళికి ‘మెకానిక్ రాకీ’.. 

హీరో విశ్వక్‌సేన్ రాబోయే చిత్రం ‘మెకానిక్ రాకీ’. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేయనున్నారు. మేకర్స్ గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. మనోజ్ కటసాని డీవోపీ సహకారం అందిస్తుండగా.. నరేశ్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రాఘురామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

డిసెంబర్‌లోనే ‘కన్నప్ప’.. 

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’. దీంట్లో ప్రభాస్ వంటి ప్రముఖులు ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘డిసెంబర్ 2024’ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టటం ద్వారా కన్నప్ప రిలీజ్ అప్‌డేట్‌పై క్లారిటీ ఇచ్చారు విష్ణు. స్పష్టమైన తేదీ పేర్కొననప్పటికీ ఇదే ఏడాది ఈ సినిమా వస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 6న ‘పుష్ప విడుదల చేయనున్నట్టు దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తే.. అల్లు అర్జున్, విష్ణు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది.