15-02-2025 11:30:58 PM
చిన్నశివునూర్ గ్రామంలో ఉద్రిక్తత
ఆటో ఢీకొట్టడంతో ఇద్దరు సీఆర్‌పీ ఉద్యోగుల మృతి
చేగుంట,(విజయక్రాంతి): ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో మృతి చెందిన సీఆర్‌పీ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుని శవంతో బంధువులు, ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే... చేగుంట మండలం కర్ణాల్‌పల్లి శివారులో శుక్రవారం ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో సీఆర్‌పీ ఉద్యోగులు మాలోత్ రమేశ్, ఎర్ర శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. వీరు బైక్‌పై వస్తుండగా చిన్నశివునూర్ గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మణ్ అనే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల రెండు నిండు ప్రాణాలు బలిగొన్నారని ఆరోపిస్తూ మృతుడు ఎర్ర శ్రీనివాస్ కుటుంబీకులు, గ్రామస్తులు శవాన్ని తీసుకొని ఆటో డ్రైవర్ ఇంటి ముందు శనివారం నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున బంధువులు, గ్రామస్తులు తరలిరావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రామాయంపేట సీఐ వెంకట రాజాగౌడ్ పోలీసు బృందాలతో చిన్నశివునూర్ గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితులను సముదాయించి న్యాయం జరిగేలా చూస్తామని హామీనివ్వడంతో శవాన్ని తీసుకెళ్ళారు. కాగా ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తూప్రాన్‌లో నిరసన...
సీఆర్‌పీ ఉద్యోగులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు తూప్రాన్‌లో శనివారం నిరసన వ్యక్తం చేశారు. మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వం రెండు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే చేగుంటలో సైతం మృతులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, పీఆర్‌టీయు మండల అధ్యక్షుడు గజగట్ల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు చల్లా రామకృష్ణ, పరమేశ్వర్‌రెడ్డి, సిద్దిరాములు, విజయలక్ష్మీ, యాదగిరి, వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.