* రాజ్యసభ చైర్మన్ తొలగింపునకు విపక్షాల పట్టు
* నోటీసును తిరస్కరించిన డిప్యూటీ చైర్మన్ హరివంశ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీస్ తిరస్కరణకు గురైంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. విపక్షాలు పెట్టిన తీర్మానం వాస్తవ ప్రాతిపదికన లేదని, చట్టబద్ధమైన ఆందోళన కంటే ప్రచారం పొందడమే వారి లక్ష్యంగా కనిపించినట్లు హరివంశ్ వ్యాఖ్యనించారు.
అవిశ్వాస తీర్మానానికి 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉండగా, శీతాకాల సమావేశాలు మరో పది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి నోటీసు ఇచ్చిందని అందుకే తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ తిరస్కరించారు. దీంతో పాటు ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ పేరు స్పెల్లింగ్‌ను కూడా తప్పుగా రాశారని హరివంశ్ తెలిపారు. రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష నేతలనే ఆయన లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆయనపై అభిశంసన నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆమ్‌ఆద్మీతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు దీనికి మద్దతిచ్చారు. ధన్‌ఖడ్ అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ.. ప్రతిపక్ష నేతలకు పాఠాలు చెబుతున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో ఇండియా కూటమి నేతలు ఆయనపై అవిశ్వాస తీర్మానానికి పూనుకున్నాయి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఇండియా కూటమిలోని పార్టీలన్నీ సంతకాలు చేశాయి. డిసెంబర్ 10న నోటీసు ఇచ్చారు.
అయితే శీతాకాల సమావేశాలు మరో 10 రోజుల్లో ముగుస్తుండటంతో ప్రతిపక్షాల నోటీసును హరివంశ్ తిరస్కరించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. అదానీ లంచాల వ్యవహారం ఉభయ సభలను కుదిపేసింది. అదానీ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో సభలో నిరసనలు, ఆందోళనలతో సమయం వృథా అయ్యింది.