calender_icon.png 28 January, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న కారణాలతో తిరస్కరిస్తారా?

05-07-2024 01:04:41 AM

కోర్టు ఉత్తర్వులు లేకపోతే రిజిస్ట్రేషన్ చేయరా?

సబ్ రిజిస్ట్రార్‌ను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): వివాదాలకు సంబంధించి ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకపోయినా గత ఉత్తర్వుల ఆధారంగా రిజిస్ట్రేషన్లను తిరస్కరించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. ఒకసారి కోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని లేదా స్టే ఉత్తర్వులు జారీ చేసిన కేసుల్లో ఆ తరువాత వాటిని రద్దు చేసినా, సవరించిన తరువాత కూడా రిజిస్ట్రేషన్లను తిరస్కరించడాన్ని తప్పుబట్టింది. అంతేగాకుండా తాజాగా కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ పట్టుబట్టడం ప్రజలకే కాకుండా కోర్టులపైనా భారం పడుతుందని వ్యాఖ్యానించింది. ఒకే కారణం మీద పలుమార్లు రిజిస్ట్రేషన్లను తిరస్కరించరాదని పేర్కొంది.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని సర్క్యూలర్‌ను సిద్ధం చేసి సబ్‌రిజిస్ట్రార్లకు పంపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరిష్కారమైన వివాదంలో కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ రిజిస్ట్రేషన్ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన అనంతరామేశ్వరిదేవి వేర్వేరుగా 23 పిటిషన్లు వేశారు. వీటిపై ఇటీవల జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పెద్దఅంబర్‌పేటలోని సర్వే నెం.265కి సంబంధించి ఇనాందారుల వారసత్వ వివాదంపై పిటిషన్లు దాఖలు కాగా 2014లో హైకోర్టు యథాతథస్థితి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

అనంతరం 2017 ఆగస్టులో ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టివేస్తూ వివాదంపై ఆర్డీవో తేల్చేదాకా యథాతథస్థితి ఉత్తర్వులు కొనసాగుతాయని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో 2024 మేలో ఆర్డీవోతోపాటు ఇబ్రహీంపట్నం ఇనాం ట్రైబ్యునల్ కూడా ఆ పిటిషన్లను కొట్టివేసిందన్నారు. ఎలాంటి నిషేధ ఉత్తర్వులు లేకపోయినా రిజిస్ట్రేషన్‌కు కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ అంబర్‌పేట సబ్‌రిజిస్ట్రార్ తిరస్కరించారన్నారు.

వాదనలను విన్న న్యాయమూర్తి రిజిస్ట్రేషన్ అధికారులు కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలేదన్నారు. ఇలాంటి వివాదాలపై ప్రజలు హైకోర్టుకు వచ్చినపుడు సబ్‌రిజిస్ట్రార్‌ను పిలిపించి వివరణ అడిగితే పార్టీలు తమవద్దకే రాలేదని చెబుతున్నారన్నారు. స్వల్ప కారణాలతో రిజిస్ట్రేషన్‌ను తేలికగా తిరస్కరిస్తున్నారని, దీనివల్ల ప్రజలు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో భారం పెరుగుతోందన్నారు. ఈ 23 రిజిస్ట్రేషన్లను తిరస్కరించడానికి కారణాలను ఈనెల 5న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ అంబర్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.