17-04-2025 01:55:49 AM
ఇందిరాపార్క్ వద్ద టీజీయూసీటీఏ జేఏసీ ధర్నాలో వక్తలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16(విజయక్రాంతి): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తు న్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (టీజీయూసీటీఏ) జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ స్పీకర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహరావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు తదితరులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అందుకు సుప్రీంకోర్టు కూడా అనుకూలంగా ఉందని న్యాయపరమైన చిక్కులు రావని అన్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ..ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఉంచి కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేసుకునేలా తాను పోరాడుతానన్నారు.
జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూజీసీ ఇబ్బందులుంటే కేంద్రానికి లేఖ రాయాలన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ నాయకులు ధర్మతేజ, పరశురాం, విజయేందర్‌రెడ్డి, ఉపేందర్, వేల్పుల కుమార్, తాళ్లపెల్లి వెంకటేశ్వర్లు, రవి, చిర్ర రాజు, శ్రీధర్‌లోథ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.