21-04-2025 01:49:21 AM
అవగాహన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి
నిజామాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రైతులకు వారి భూములపై సమగ్ర హక్కులు కల్పించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూ భారతి (నూతన ఆర్.ఓ.ఆర్) - 2025 చట్టాన్ని తెచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. ముఖ్యంగా ధరణి ద్వారా పరిష్కారానికి అవకాశం లేకుండాపోయిన అనేక సమస్యలకు భూభారతి కొత్త చట్టం పరిష్కారం కల్పిస్తుందని అన్నారు.
ఈ మేరకు రైతులకు వెసులుబాటు కల్పిస్తూ, కీలక అంశాలను కొత్త ఆర్ ఓ ఆర్ చట్టంలో పొందుపర్చారని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో జారీ కానున్నాయని అన్నారు.
2014 జూన్ 2వ తేదీ కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాధాబైనామా ద్వారా కొనుగోలు చేసి, గడిచిన పుష్కర కాలంగా అనుభవంలో ఉంటూ, 2020 అక్టోబర్ 12 నుండి నవంబర్ 10వ తేదీ మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులను ఆర్డీఓ లు విచారణ చేసి, అర్హత కలిగిన వారి సాధాబైనామాలను క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. పిఓటి, ఎల్.టి.ఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేనివి క్రమబద్ధీకరణ చేసే నాటికి స్టాంప్ డ్యూటీ, జిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని అన్నారు.
హక్కుల రికార్డులు, భూమి వివరాలను నమోదు చేసి పాస్ బుక్ జారీ చేస్తారని వివరించారు. ధరణి లో సాధాబైనామా క్రమబద్దీకరణకు అవకాశం ఉండేది కాదన్నారు. చిన్న, సన్నకారు, పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. వారసత్వ ఒప్పంద పత్రం, వీలునామా కాపీ, నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం జత చేయాలని, ఈ దరఖాస్తుల పై తహసిల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. గడువు లోపు పరిష్కరించకపోతే దానంతటఅదే మ్యూటేషన్ జరిగిపోతుందని అన్నారు.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు ఉంటాయని అన్నారు. కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగం పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మార్పులు చేసి పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేస్తారని తెలిపారు. 300 రూపాయల ఫీజుతో పాస్ బుక్ జారీ చేస్తారని అన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు.
ఆధార్ కార్డు తరహాలోనే భూమికి సంబంధించిన వివరాలతో రైతులకు భూదార్ సంఖ్యను కేటాయిస్తారని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పడుతుందని అన్నారు. భూ భారతి చట్టంపై రైతులు వెలిబుచ్చిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు, మార్కెట్ కమిటీలు, సొసైటీల చైర్మన్ లు, రైతులు పాల్గొన్నారు.