- ఇకపై ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్
- ఏ ఏడాది ఫీజు ఆ ఏడాదిదే చెల్లింపు
- పాత బకాయిలన్నీ త్వరలోనే చెల్లిస్తాం
- ఆ బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుది
- ఇంజినీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా ఉండొద్దు
- విద్యార్థులకు పట్టాలు కాదు.. స్కిల్స్ కావాలి
- ఇంజినీరింగ్ విద్యపై సదస్సులో సీఎం రేవంత్
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ క్రమం తప్పకుండా చెల్లిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏ ఏడాది ఫీజు రీయింబర్స్ మెంట్ ఆ ఏడాదే చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. విద్యా సంస్థలకు పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను కూడా త్వరలోనే చెల్లిస్తామని, ఆ బాధ్యతను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నట్లు చెప్పారు.
శనివారం కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌పై యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ఏఐ గ్లోబల్ సమ్మిట్ లోగోను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఇంజినీరింగ్ కాలేజీలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రతి పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెచ్చారని చెప్పారు. వివిధ కారణాల వల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయా యని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎప్పటికప్పుడు ఫీజులు చెల్లించేందుకు ప్రయత్నిస్తామని కళాశాలల యాజమాన్యాలకు భరోసా ఇచ్చారు. ఇందుకోసం త్రిముఖ వ్యూహంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు.
కాలేజీలు నిరుద్యోగుల పరిశ్రమలు కాకూడదు
దేశంలో, ప్రపంచంలో గొప్పగొప్ప నిర్మాణాలన్నీ ఇంజినీర్లు సృషించినవేనని సీఎం అన్నారు. మానవ నిర్మిత అద్భుతాలన్నీ ఇంజినీర్లు ఆవిష్కరించినవేనని చెప్పారు. ఇంజినీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను ఉత్ప త్తి చేసే పరిశ్రమలుగా మారకూడదని కాలేజీల యాజమాన్యాలకు సూచించారు. విద్యార్థులు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి దేశ భవిష్యత్తును నిర్మించేలా విద్యా సంస్థలు ఉండాలని సూచించారు. అందుకు కావాల్సిన సాయా న్ని అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పు డూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుం డా.. దేశానికి మేధావులను అందించే సంస్థలుగా ఇంజినీరింగ్ కాలేజీలు మారాలని పిలుపునిచ్చారు.
అన్ని కోర్సులను కాలేజీలు ప్రోత్సహించాలి
కొన్ని కాలేజీల్లో సివిల్ ఇంజినీరింగ్‌ను లేకుండా చేసేలా ప్రణాళికలు వేస్తున్నారని సీఎం అన్నారు. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్‌తోపాటు సివిల్, మెకానికల్ వంటి కోర్సులనూ ప్రోత్సహించాలని సూచించారు. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్‌తో పాటు ఇతర కోర్సులను కచ్చితంగా నడపాలని తెలిపారు. ఈ మూడు కోర్సులు లేకపోతే దేశం ప్ర మాదాన్ని ఎదురుకుంటుందని హెచ్చరించారు.
ప్రపంచాన్ని నడిపించేది ఏఐ
స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా టాటా భాగస్వామ్యంతో రూ.2400 కోట్లతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలు మారుస్తోందని సీఎం చెప్పారు. ఫార్మా, ఐటీ తరువాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని నడిపించబోతోందని పేర్కొన్నారు. గత సీఎంలు తీసుకున్న విధానాల వల్ల మనం ఐటీ, ఫార్మా రంగాల్లో ముందున్నామని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కోర్సులుండాలని ఆయన సూచించారు. ఏఐకి సంబంధించిన కోర్సు ప్రవేశపెడితే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 60 లక్షల నిరుద్యోగులున్నా.. ఇతర ప్రాంతాల నుంచి ఎంతోమంది వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారని తెలిపారు. యువత కోసం త్వరలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి అటానమస్ హోదాను ఇస్తామని ప్రకటించారు. పక్క రాష్ట్రాలతో పోటీపడేలా కాకుండా.. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.