03-04-2025 12:06:51 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 2 : (విజయక్రాంతి): ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెతగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిస్థితి మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేసముద్రం మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయాలని తలచింది.
ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ నెలలో కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, దనసరి, సబ్ స్టేషన్ తండ గ్రామాలను కలిపి కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పాటుకు ప్రతిపాదించింది. దీనితో అధికారులు విలీన గ్రామాల్లో గత డిసెంబర్ 9న గ్రామసభలు నిర్వహించగా ప్రజలు మున్సిపాలిటీ గా ఏర్పాటుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు.
ఆ మేరకు ప్రభుత్వం అదే నెల 19న అసెంబ్లీలో కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 28న కేసముద్రంలో పురపాలన ప్రారంభించారు. విలీన గ్రామాల పంచాయతీల రికార్డులను మున్సిపాలిటీ పరిధిలోకి చేర్చి ఇంటి పన్ను స్థానంలో ఆస్తి పన్ను నిర్ణయించడానికి చర్యలు చేపట్టారు.
అయితే మున్సిపాలిటీగా ఏర్పడ్డ కేసముద్రంలో ఆస్తి పన్ను మున్సిపాలిటీ రికార్డుల్లో నమోదు చేయకపోవడం వల్ల రెండు మాసాలుగా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో భూములు, ఇండ్ల అమ్మకాలు, కొనుగోళ్ళు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల శాఖ ఆధీనంలో రిజిస్ట్రేషన్ జరిగితే ఆన్లైన్ ద్వారా సదరు ఆస్తికి సంబంధించిన మార్పిడి (మ్యూటేషన్) కి సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతోరిజిస్ట్రేషన్లు చేయడం లేదు.
ఫలితంగా రెండు నెలలుగా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తుల విక్రయాలు, కొనుగోళ్ళు స్తంభించిపోయాయి. దీనితో అటు ప్రభుత్వ ఆదాయానికి, ఇటు కొనుగోలు, అమ్మకాలు చేయడానికి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అవసరానికి ఎవరైనా తమ ఆస్తిని విక్రయించుకోవాలంటే కొనేవారు ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్, మార్పిడి ప్రక్రియ ఆన్లైన్ సాంకేతిక లోపం కారణంగా ముందుకు సాగడం లేదని చెబుతున్నారు.
ఫలితంగా మున్సిపాలిటీ ఏర్పడి తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆస్తి కొనుగోలు, అమ్మకం దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కేసముద్రం నూతన మున్సిపాలిటీ లో ఆస్తులకు సంబంధించి కొత్తగా ధ్రువీకరణ నంబర్లు కేటాయించి, కొనుగోలు, అమ్మకాలకు ఆటంకం తొలగించాలని కోరుతున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
కేసముద్రం మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు సంబంధించిన ఆస్తుల వివరాలను మున్సిపల్ సిడిఎంఏ పోర్టల్ లో నమోదు కాకపోవడం వల్ల ఆన్లైన్లో వివరాలు కనిపించడం లేదని, దీనితో ఆస్తుల కొనుగోలు అమ్మకాలకు ఇబ్బందిగా మారిందని, ఈ విషయంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులకు నివేదించామని, త్వరలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కేసముద్రం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి తెలిపారు.
ప్రసన్న రాణి,
మున్సిపల్ కమిషనర్