calender_icon.png 27 December, 2024 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిట!

01-08-2024 12:21:34 AM

  1. ఆగస్టు నుంచి చార్జీలు పెరుగుతాయని ప్రచారం
  2. వ్యవసాయ, సాధారణ భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు ఎగబడిన యజమానులు
  3. పలుచోట్ల మొరాయించిన ఆధార్ ఈకేవైసీ ఆన్‌లైన్ సేవలు
  4. చార్జీల పెంపుపై స్పష్టత ఇవ్వని రాష్ట్రప్రభుత్వం
  5. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు?

విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 31: రాష్ట్రప్రభుత్వం గురువారం (1వ తేదీ) నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతుందని కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏ రకమైన భూమికి ఎంతెంత ఛార్జీలు పెరగనున్నాయి ? నియమ నిబంధనలేంటి? అనే విషయంపై ఇప్పటివరకు సర్కారు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ భూ యజమానులు మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కొద్దిరోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు.

బుధవారం 31వ తేదీ కావడంతో ఈ ఒక్కరోజే రోజువారీ రిజిస్ట్రేషన్ల సంఖ్యకంటే మరింత పెరిగింది. కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవలం మంగళ, బుధవారాల్లోనే 200 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. జగిత్యాల జిల్లాకేంద్రంతో పాటు కోరుట్ల, మెట్‌పల్లి, మల్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. కామారెడ్డి జిల్లాకేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 50 వరకు రిజిస్ట్రేషన్లు కాగా ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఒకటి అర రిజిస్ట్రేషన్లు మాత్రమే పూర్తయ్యాయి. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు భారీగా భూయజమానులు తరలివస్తున్నారు.

హుజూర్‌నగర్ కార్యాలయంలో గతంలో రోజుకు 10 వరకు రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా వారం రోజులుగా 14 20 వరకు, సూర్యాపేటలో గతంలో రోజుకు 20 వరకు రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా, ఇప్పుడు 80 వరకు పూర్తవుతున్నాయి. తుంగతుర్తి, కోదాడలో గతంలో రోజుకు 15 వరకు రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా ప్రస్తుతం 30 వరకు పూర్తవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల సర్వర్ డౌన్ అయి ఆధార్ ఈకేవైసీ ఆన్‌లైన్ సేవలు మొరాయించాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. బుధవారం ఒక్కరోజు జిల్లావ్యాప్తంగా 196 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.

ప్రభుత్వం ప్రకటన విడుదల చేస్తేనే..

రాష్ట్రంలో వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో రిజిస్ట్రేషన్ల పెంపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్ర భుత్వానికి ఆదాయం వచ్చే వనరుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఒకటి. వ్యవసాయ, వ్యవ సాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలపై రాష్ట్రప్రభుత్వం నుంచి అధి కారిక ప్రకటన విడుదలైతే తప్ప ఆ అంశంపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ సైతం ఇప్పటివరకు చార్జీల పెంపుపై ఎలాంటి కసరత్తు చేసింది.. ఏ ప్రమాణాలు పాటిస్తుందనే అంశంపై ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. మరోవైపు ఇప్పట్లో చార్జీలు పెంచే అవకాశం లేదని, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే తప్ప రాష్ట్రప్రభుత్వం ఆ అంశాన్ని పట్టించుకునే పరిస్థితి లేదనే అభిప్రాయం అధికారిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.