calender_icon.png 27 September, 2024 | 8:57 PM

సిద్ధూపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి

26-09-2024 02:30:15 AM

ముడా స్కాంపై 3 నెలల్లో నివేదిక ఇవ్వాలి

లోకాయుక్తకు బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు

బెంగళూరు, సెప్టెంబర్ 25: కర్ణాటక సీఎం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు న్న మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యపై విచారణ జరపాలని బుధవారం బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి మూడు నెలల్లో విచారణ చేసి నివేదిక సమర్పించాలని లోకాయుక్తను న్యాయస్థానం నిర్దేశించింది. ముడా కేసులో తనపై దర్యాప్తునకు గవర్నర్ ఆదేశాలపై చట్టబద్ధతను సవాలు చేస్తూ సిద్ధరామ య్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన మరుసటి రోజే స్పెషల్ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

ప్రత్యేక కోర్టు ఆదేశాలతో మైసూర్ జిల్లా లోకాయుక్త పోలీసులు విచారణ చేపట్టనున్నారు. మరోవైపు ఈ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 

కాగా ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలంటూ ఇదివరకే కర్ణాటక గరవ్నర్ థావర్‌చంద్ గహ్లోత్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ గహ్లోత్ ఆదేశాల్ని సవాలు చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని.. సిద్ధరామయ్య పిటిషన్‌ను కొట్టేశారు.

ముడా కేటాయింపుల్లో అవకతవకలు ఉన్నట్లు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సిద్ధరామయ్య భార్యకు మైసూర్ పరిసరాల్లో విలువైన భూములు కేటాయించడం అక్రమమని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. భూముల కేటాయింపుతో రాష్ట్ర ఖజానాకు రూ.45 కోట్ల నష్టం వాటిల్లినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. లోకాయుక్త విచారణకు ఆదేశించిన స్పెషల్ కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య స్పందించారు. విచారణతోపాటు దేనికీ తాను భయపడనని పేర్కొన్నారు.