టేకులపల్లి మండల కాంగ్రెస్ నాయకుల విమర్శ...
టేకులపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీని తిట్టే నీచ చరిత్ర రేగా కాంతారావు, బానోత్ హరిప్రియలదని టేకులపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్యా దేవా నాయక్ అన్నారు. టేకులపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో రైతులను మోసం చేసిన వారిపై రైతులు కేసులు పెడితే, కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిందంటారా, కాంగ్రెస్ పార్టీ నిందవేసే ముందు పిఎసిఎస్ చైర్మన్ రైతులకు చేసిన మోసం గుర్తించి మట్లాడాలన్నారు.
రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేసిన వ్యక్తికి వత్తాసు పలుకుతున్న బీఆర్ఎస్ నాయకులు, రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం చేతగానితనం కనిపిస్తుందని విమర్శించారు. మాట్లాడే ముందు గతాన్ని, రాజకీయ బిక్ష పెట్టిన పార్టీని గుర్తుచేసుకోవాలని అన్నారు. విలేకరుల సమావేశంలో నాయకులు ఇస్లావత్ రెడ్యా నాయక్, ఈది గణేష్, మోకాళ్ళ పోషాలు, వాంకుడోత్ పున్య నాయక్, బుర్ర ధర్మయ్య గౌడ్, బండ్ల రజిని, బానోత్ శంకర్, అజ్మీరా శివ తదితరులు పాల్గొన్నారు.