calender_icon.png 20 September, 2024 | 10:17 PM

అగ్నిపథ్‌లో సంస్కరణలు!

06-09-2024 12:18:18 AM

  1. సైన్యం నుంచి సైతం పలు సిఫార్సులు 
  2. 50 శాతం మందిని కొనసాగించటంపై సమాలోచనలు 
  3. వయోపరిమితిని కూడా పెంచే యోచనలో కేంద్రం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: త్రివిధ దళాల్లో నియామకాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై సొంత పక్షాలతో పాటు విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. తమ ప్రధాన ఎజెండాలో అగ్నివీర్ పథకం రద్దు చేస్తామని ప్రకటించాయి. ఎన్నికల తర్వాత జేడీయూ, టీడీపీ మద్దతుతో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ప్రస్తుతం అగ్నిపథ్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జేడీయూ కూడా అగ్నిపథ్‌పై పునరాలోచించాలని బీజేపీకి సూచించింది. దీంతో పలు మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

కీలకాంశాల్లో మార్పు 

అగ్నిపథ్ స్కీములో ప్రధానంగా వినబడే అభ్యంతరాలు రెండు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత 25 శాతం మందినే రెగ్యులర్ ఉద్యోగాలకు తీసుకోవడం, మిగిలిన 75 శాతం మందికి కనీసం పెన్షన్ సౌకర్యం కల్పించకపోవడం. వీటినే ఆయుధాలుగా విపక్షాలు అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో స్వపక్షం డిమాండ్లు, విపక్షాల విమర్శల నేపథ్యంలో పథకంలో పలు మార్పులు చేసేందుకు రక్షణశాఖ సిద్ధమైందని జాతీయ మీడియా వెల్లడించింది.

నాలు గేళ్ల సర్వీసు తర్వాత 50 శాతం అగ్నివీరులను కొనసాగించాలని, వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచాలని సైన్యం సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. జీతభత్యాల్లో నూ మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సైన్యంలో అంతర్గతంగా సర్వే లు నిర్వహించి కేంద్రానికి ఆర్మీ పలు సూచనలు చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపా యి. 25 శాతం మందికే కొనసాగే అవకాశమిస్తే భవిష్యత్తులో ఆర్మీలో సైనిక బలం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

అనేక హామీలిచ్చినా..

2022 జూన్‌లో తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం నిబంధనల ప్రకారం నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులు విధుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. వారిలో కేవలం 25 శాతం మందినే రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుని కొనసాగిస్తారు. 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువతీయువకులే అగ్నిపథ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల సర్వీసు అనంతరం తప్పుకున్న అగ్నివీర్‌లకు పెన్షన్ సౌకర్యం కూడా ఉండదు. దీనిపై మొదటి నుంచి విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

సర్వీసు వదిలేసిన 75 శాతం అగ్నివీరుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రం పేర్కొంది. శిక్షణ పొందిన సిబ్బంది బీఎస్‌ఎఫ్‌లోకి తీసుకుంటామని చీఫ్ డీజీ నితిన్ అగర్వాల్ చెప్పారు. బీఎస్‌ఎఫ్‌లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. అనంతరం కొన్ని రాష్ట్రాలు సైతం వారి సేవలను వినియోగించుకుంటామని ప్రకటనలు చేసినా విపక్షాల నుంచి పథకంపై విమర్శలు మాత్రం తగ్గలేదు.